Fuel Price: పండగ వేళ ఊరట

చమురు ధరల మంటతో దేశం అల్లాడిపోతున్న తరుణంలో లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. గురువారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి విడుదల

Updated : 04 Nov 2021 11:58 IST

డీజిల్‌పై రూ.10, పెట్రోలుపై రూ.5 సుంకం తగ్గింపు
నేటి నుంచి అమల్లోకి: కేంద్రం

ఈనాడు, దిల్లీ: చమురు ధరల మంటతో దేశం అల్లాడిపోతున్న తరుణంలో లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. గురువారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డీజిల్‌పై సుంకం ఒకేసారి రూ.10 తగ్గించడం వల్ల రబీ సీజన్‌లో రైతులకు మేలు కలుగుతుందని పేర్కొంది. ‘‘ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దానివల్ల దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో అది ద్రవ్యోల్బణ ఒత్తిడికి దారితీసింది. ప్రపంచ దేశాలన్నీ కొరతను చవిచూడడంతో అన్ని రకాల ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడానికి పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. తాజా నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్గించాలి’’ అని ఆర్థికశాఖ పేర్కొంది. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు, త్వరలో యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వ్యాఖ్యలు రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సుంకం తగ్గింపు ద్వారా ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి కానుక ఇచ్చారని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ట్వీట్‌ చేశారు. ‘పన్నులపై ఆధారపడి బతుకుతున్న మోదీ సర్కారుకు’ ఉప ఎన్నికల్లో వాస్తవ చిత్రాన్ని ప్రజలు చూపించారని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

రూ.7 చొప్పున తగ్గించిన ‘భాజపా’ రాష్ట్రాలు

చమురు ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించిన క్రమంలోనే దేశంలోని పలు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఈ మేరకు పెట్రోలు, డీజిల్‌ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. ఈ రెండు ఇంధనాలపై అస్సాం, మణిపుర్‌, త్రిపుర, గోవా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఫలితంగా కేంద్ర తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోలు రూ.12, డీజిల్‌ రూ.17 మేర చవక కానున్నాయి.


రాష్ట్రంలోనూ తగ్గించాలి: బండి

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌  హర్షం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిలుపై పది శాతం వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని