Fuel Prices: పేదింట చమురు మంట

పెట్రోలు, డీజిల్‌ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పేదలు అల్లాడిపోతున్నారు. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్‌ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ఇక పోషకాహారం ఎక్కడ’’ అని సామాన్య, పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 27 Oct 2021 13:11 IST

అందని పోషకాహారం

మండిపోతున్న నిత్యావసరాలు

పెట్రో ధరలతో అన్నింటిపైనా ప్రభావం

ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబం నెలలో ఒకసారి చికెన్‌, మటన్‌ కిలో కొని తింటే రూ.1,000కి పైగా చెల్లించాల్సి వస్తోంది. నిత్యావసరాలకు రూ.2 వేలు పెట్టినా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కోడిగుడ్డు కూడా ఒక్కోటి రూ.5 నుంచి రూ.6కి అమ్ముతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరల మంటతో సామాన్య, పేద కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పేదలు అల్లాడిపోతున్నారు. పోషకాహారం మాట అటుంచి ఏదో విధంగా ఆకలి తీరితే చాలనే పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు పలువురు వివరించారు. ‘‘కొవిడ్‌ వంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇతరత్రా జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ పెరిగిన కూరగాయలు, వంటనూనెలు, పప్పుల వంటివాటి ధరలతో కడుపు నిండడమే కష్టంగా ఉంది. ఇక పోషకాహారం ఎక్కడ’’ అని సామాన్య, పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు కూరగాయలు కొనడం కూడా తగ్గించారని హైదరాబాద్‌ రైతుబజార్ల అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గతంలో కిలో, 2 కిలోలు కొనేవారు ఇప్పుడు అందులో సగమే కొంటున్నారని వివరించారు. పప్పులు, వంటనూనెల అమ్మకాలూ తగ్గినట్లు హైదరాబాద్‌ మలక్‌పేట టోకు మార్కెట్‌ వ్యాపారి రాజేష్‌ చెప్పారు. ఇక్కడ నుంచి రోజూ పలు జిల్లాల చిల్లర వ్యాపారులు నిత్యావసర సరకులు లారీల్లో తీసుకెళ్తారని, ధరల పెరుగుదల వల్ల వారు కొనుగోళ్లు తగ్గించారని వివరించారు. ‘‘నాలుగైదు నెలల్లోనే కందిపప్పు, మినప్పప్పు, వంటనూనెల వంటి వాటి కిలో ధర రూ.10 నుంచి రూ.30 దాకా పెరిగింది. ఇంత వేగంగా పెరుగుదల ఇటీవల ఎప్పుడూ చూడలేదు’’ అని ఇక్కడి టోకు వ్యాపారులు తెలిపారు.

పది కుటుంబాలను ఆరా తీస్తే...

పెట్రో ధరల ప్రభావం పేద, సాధారణ కుటుంబాలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈనాడు ప్రయత్నించింది. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లలో పది కుటుంబాలను ఆరా తీస్తే ఆవేదనే సమాధానమైంది. రోజూ పోషకాహారం తింటున్నారా అని అడిగితే ఒక్క కుటుంబమైనా ‘తింటున్నాం’ అని చెప్పలేదు.


ఒక్కోరోజు పచ్చడి, మజ్జిగతోనే భోజనం

- మునిగెల లక్ష్మీనారాయణ, ఆటోడ్రైవర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ

నేను 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఏడాది క్రితం లీటరు రూ.65 ఉన్నప్పుడు రోజుకు రూ.600 నుంచి రూ.700 ఆదాయం వచ్చేది. ఇప్పుడు అందులో సగం కూడా రావడం లేదు. కరోనా రాకముందు వారానికి ఒకట్రెండుసార్లు గుడ్లు, చికెన్‌, మటన్‌ వంటి ఆహారం తెచ్చుకున్నా డబ్బులుండేవి. ఇప్పుడు అవి అంతగా తినడం లేదు. ఒక్కోరోజు పచ్చడి, మజ్జిగతోనే భోజనం ముగిస్తున్నా.


ఎలా బతకాలో తెలియడం లేదు

నాకు ముగ్గురు సంతానం. బైక్‌ మెకానిక్‌ని. రోజూ రూ.400 నుంచి రూ.500 వస్తుంది. కరోనా రాకముందు వాటిలో రూ.100 నుంచి రూ.200 పొదుపు చేసుకునే వాళ్లం.  ఇప్పుడు కూరగాయలు కొనాలన్నా ఒక్కోసారి చేతిలో డబ్బులుండటం లేదు. పెట్రోలు ధరల పెరుగుదలతో బైకుల వాడకం తగ్గిస్తున్నారు. నాకు ఆదాయం అంతగా రావడం లేదు. ఇక పోషకాహారం మాకు ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎలా బతకాలో తెలియడం లేదు.

- డి. వెంకటేష్‌, బైక్‌ మెకానిక్‌, వరంగల్‌


టమాటాలు, బీరకాయలు కొనలేం!

నేను నెలకు రూ.15 వేల జీతానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా. గతంలో పెద్దగా అప్పులు చేసేవాడిని కాదు. ఇప్పుడు వైద్యం, ఇంటి ఖర్చులకే అప్పులు చేయాల్సి వస్తోంది. టమాటాలు, బీరకాయల వంటివి కిలో రూ.40 నుంచి రూ.50 చెబుతున్నారు. మాలాంటి చిన్న కుటుంబాలు ఏం కొనగలవు? అవి తినే ఆర్థిక స్థోమత చాలా కుటుంబాలకు లేనేలేదు.

- పెండ్యాల అశోక్‌, వాచ్‌మెన్‌, హన్మకొండ


జీతం చాలక అప్పులపాలు

నేను సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనిలో కాంట్రాక్టు కార్మికుడిగా నెలకు రూ.9 వేలకు పనిచేస్తున్నా. పెరుగుతున్న ధరలతో జీతం సరిపోక అవసరమైతే అప్పులు తెచ్చుకుంటున్నా. గతంలో రూ.500కి వచ్చిన సరకులు ఇప్పుడు రూ.800 పెట్టినా రావడం లేదు. ధరలు తగ్గించకుండా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా పేద కుటుంబాలు బతకలేవు.

- జిముడ శంకర్‌, బొగ్గు గని కాంట్రాక్టు కార్మికుడు, జయశంకర్‌ భూపాలపల్లి


బస్‌పాస్‌ తీసుకుని తిరుగుతున్నా

కొవిడ్‌కు ముందు మా షోరూంలో రోజుకు 25 నుంచి 30 బైకులు అమ్మేవాళ్లం.  ఇప్పుడు 10 కూడా అమ్మలేకపోతున్నాం. పెట్రో ధరలకు భయపడి బైకుల వాడకం తగ్గిస్తున్నారు. నెలకు నాకొచ్చే రూ.15 వేలతో బతకడం చాలా కష్టంగా ఉంది. గతంలో బైకుపై తిరిగేవాడిని. ఇప్పుడు బస్‌పాస్‌ తీసుకుని తిరుగుతున్నా. కడుపు నిండడమే కష్టంగా ఉంది.

- రవి, బైకు షోరూం ఉద్యోగి, హైదరాబాద్‌


బతుకుల్ని ఆగం చేస్తున్న ధరలు

నేను ప్రైవేటు ఆఫీసులో నెలకు రూ.10 వేలకు అటెండర్‌గా పనిచేస్తున్నా. భార్య గృహిణి. మాకు ఇద్దరు పిల్లలు. పెట్రోలు, డీజిల్‌ ధరలు మాలాంటి చిన్న కుటుంబాల బతుకును ఆగం చేస్తున్నాయి. ఏడాదిలోనే ఇంటి ఖర్చులు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ఇంతకుముందు బైక్‌పైనే తిరిగేవాడిని. ఇప్పుడు 2, 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తే సైకిలు వాడుతున్నా. ఇంట్లో సరకుల వాడకం, కొనుగోలు తగ్గించాం.

- స్వామిరాజు, చిరుద్యోగి, కరీంనగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని