Alai Balai: యువత చేతుల్లోనే సాంస్కృతిక పునరుజ్జీవం

పూర్వీకుల అనుభవాల నుంచి పుట్టిన ఆచారాలు, సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం తక్షణ అవసరమని..

Updated : 18 Oct 2021 05:06 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సందడిగా ‘అలయ్‌ బలయ్‌’

ఈనాడు డిజిటల్‌-హైదరాబాద్‌, హిమాయత్‌నగర్‌-న్యూస్‌టుడే: పూర్వీకుల అనుభవాల నుంచి పుట్టిన ఆచారాలు, సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం తక్షణ అవసరమని.. అది యువత చేతుల్లోనే ఉందని అన్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏటా దసరా పండగ అనంతరం నిర్వహిస్తోన్న ‘అలయ్‌ బలయ్‌’ వేడుకను ఈ ఏడాది ఆయన కుమార్తె విజయలక్ష్మి చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో సందడిగా సాగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి.. దుర్గామాత, జమ్మి చెట్టుకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక ఆచార, సంప్రదాయాలుంటాయని.. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, దసరా ఉత్సవాలు ఇంటి పండగలని అన్నారు. అవి అందరికీ చేరువయ్యేలా 16 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం నిర్వహిస్తుండటం గొప్ప విషయమని అభినందించారు. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమా దాట్ల, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అధినేత ప్రసాద్‌రెడ్డి, ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డిలతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ‘మా’ అధ్యక్షుడు విష్ణులను ఉప రాష్ట్రపతి సన్మానించారు. వందేభారత్‌ మిషన్‌ మహిళా పైలట్‌ రేష్మా రజ్వానీ, యువ శాస్త్రవేత్త ప్రవీణ్‌ గోరకవి, పాత్రికేయురాలు హసీనాలను దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సన్మానించారు. అలయ్‌ బలయ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌, ఎంపీలు కె.కేశవరావు, సోయం బాపురావు, మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు, తెదేపా నేత రావుల చంద్రశేఖరరెడ్డి, ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నటుడు కోట శ్రీనివాసరావు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకురాలు, విమలక్క, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని