AP 3 Capitals: 3 రాజధానులపై మెరుగైన బిల్లు తెస్తాం

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై ప్రభుత్వం మళ్లీ సమగ్రమైన, మెరుగైన బిల్లుల్ని రూపొందించి శాసనసభ ముందుకు తెస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 23 Nov 2021 05:16 IST

పాలన వికేంద్రీకరణపై అవసరమైన మార్పుల్ని పొందుపరుస్తాం

వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల ఉపసంహరణపై శాసనసభలో ఏపీ సీఎం జగన్‌

ఈనాడు - అమరావతి: ఏపీలో పాలనా వికేంద్రీకరణపై ప్రభుత్వం మళ్లీ సమగ్రమైన, మెరుగైన బిల్లుల్ని రూపొందించి శాసనసభ ముందుకు తెస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లులపై ఒకటిన్నర, రెండేళ్లుగా రకరకాలుగా వక్రీకరించడంతోపాటు అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ప్రకటన చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సోమవారం అసెంబ్లీలో వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రకటన సందర్భంగా మళ్లీ బిల్లు తెస్తామనే పదాలను నొక్కి వక్కాణించారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టాలని చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయం వివాదమైనదనీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసిందనీ తెలుసు.. అయినా 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం అంటే నాకెలాంటి వ్యతిరేకత లేదు.. నా ఇల్లు ఇక్కడే ఉంది’ అని వివరించారు.

కనీస వసతులకే రూ.లక్ష కోట్లు

‘అమరావతి నుంచి విజయవాడ, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరం.. అక్కడ  కనీస మౌలిక వసతుల కల్పనకు.. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు కావాలి. ఈ రోజు లెక్కల ప్రకారం రూ.లక్ష కోట్లు.. పదేళ్లు పోతే ఖర్చు ఆరేడు లక్షల కోట్లకు పెరుగుతుంది’ అని జగన్‌ పేర్కొన్నారు. ‘కనీస వసతుల్ని ఏర్పాటు చేసుకునేందుకే డబ్బులేని పరిస్థితి ఉంటే.. రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా? చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాలకు ఎప్పుడూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా? మన పిల్లలకు ఉద్యోగాలొచ్చే నగర స్థాపన ఎప్పటికి?’ అని ప్రశ్నించారు.

ఈ ఆలోచనల నుంచే రాష్ట్రంలోని పెద్ద నగరమైన విశాఖపట్నంపై దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. ‘విశాఖపట్నంలో సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి. కొద్దిగా సుందరీకరణ, ఇతర వసతులకు కొద్దిగా అదనపు విలువ జోడిస్తే.. అయిదు, పదేళ్లకైనా హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలతో పోటీ పడుతుందనేది వాస్తవం’ అని జగన్‌ స్పష్టం చేశారు. 

వికేంద్రీకరణే సరైనదని బలంగా నమ్మాం

‘నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో రాజధానుల వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టాం. అది ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈపాటికే మంచి ఫలితాలు అందేవి. అయితే వికేంద్రీకరణపై రెండేళ్లుగా అనేక అపోహలు, అనుమానాలు సృష్టించారు. దుష్ప్రచారాలు చేశారు. అనేక కోర్టు కేసులు, న్యాయపరమైనవివాదాలు తీసుకొచ్చారు. అందరికీ న్యాయం చేయాలనే ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి.. కొందరికి అన్యాయం జరుగుతోందనే వాదనను కొంతమంది ముందుకు తెచ్చారు’ అని వివరించారు.


గతంలోని కేంద్రీకరణ ధోరణుల్ని (ఒకే చోట అభివృద్ధి) ప్రజలెంత వ్యతిరేకించారో.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటమైంది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ రాజధాని వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజాతీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు వేశాం. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకున్నాం కాబట్టే.. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు మా ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.

- అసెంబ్లీలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  


అనూహ్య ఆనందం... అంతలోనే కన్నీటి పర్యంతం

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకోవాలని సోమవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో రాజధాని రైతుల దీక్షా శిబిరాల్లో ఆనందం వెల్లి విరిసింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని 700 రోజులకు పైగా ఉద్యమిస్తున్న రైతులకు బిల్లు రద్దు విషయం తెలియగానే మిఠాయిలు పంచుకున్నారు. అయితే... ఎలాంటి ఇబ్బందులు, చిక్కులు ఎదురుకాకుండా మళ్లీ వికేంద్రీకరణ బిల్లుని శాసనసభలో మరోసారి ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే శిబిరాల్లో రైతులు విచారంతో కన్నీటి పర్యంతమయ్యారు.

-ఈనాడు అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని