Updated : 18/11/2021 04:11 IST

Bandi Sanjay: రైతుల జీవితాలతో సీఎం చెలగాటం

ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడి.. వేటాడతారా?
ధాన్యంపై ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య ఇక్కడే ఎందుకు?
ఫాంహౌస్‌ నుంచి సీఎంను ధర్నాచౌక్‌కు తీసుకువస్తున్నాం
కేసీఆర్‌ చలవతో 88 అసెంబ్లీ సీట్లకు చేరుకుంటాం: బండి సంజయ్‌

విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌. పక్కన ఎమ్మెల్యే రాజాసింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ధాన్యం దిగుబడి అధికంగా వచ్చే పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లేని కొనుగోళ్ల వివాదం ఇక్కడే ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రీ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వానాకాలం పంటకొంటారో, కొనరో స్పష్టంగా చెప్పాలి.  ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటే ఆరుగురు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రైతుల సమస్య గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడతారా? వేటాడతారా? మీ బెదిరింపులు మానుకోవాలి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు... ‘‘ముఖ్యమంత్రిని బయటకు తీసుకువస్తామని చెప్పినట్లుగానే చేశాం. ప్రజల్లోకి రాకుండా ఫాంహౌస్‌లో ఉండే సీఎంను ప్రగతిభవన్‌కు, ఇప్పుడు రోడ్ల్లపైకి తీసుకువచ్చాం. ధర్నాచౌకే అవసరం లేదన్న ఆయనను అక్కడికే తీసుకువస్తున్నాం. ఇది ప్రజల, భాజపా విజయం. ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం ధాన్యం కొనుగోళ్లపై లేని సమస్యను సృష్టిస్తున్నారు. వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి? కొనడానికి డబ్బుల్లేవా?’ ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. మీరు, మేం కలిసి రైతుల్ని ఆదుకుందాం. వానాకాలం పంటను వెంటనే కొనుగోలు చేయాల్సిందే.

సమస్యలు సృష్టించే సీఎం అవసరమా?

‘‘బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఎం దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాల భర్తీ, దళితులకు మూడెకరాల భూమి, తెలంగాణ అంతటా దళితబంధు కోసం పోరాడుతాం. మమ్మల్ని, యువతను, ప్రజలను వేటాడతావా? ఇలా భయపెట్టే, సమస్యలు సృష్టించే సీఎం రాష్ట్రానికి అవసరమా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా పర్యటన విజయవంతమైంది. సీఎం భాష మార్చుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నా. బెంగాల్లో కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో 88 సీట్లు గెలుచుకున్నాం. సీఎం నోటి చలవవల్ల తెలంగాణలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలున్న భాజపా బలం 88 సీట్లకు పెరుగుతుంది. వరి వేస్తే ఉరి అన్నోళ్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం దేనికి సంకేతం? ప్రధానికి లేఖ రాయడం సంతోషం.  రాళ్లతో కొట్టించింది ఎవరు? రైతులతో నేను మాట్లాడుతుంటే తెరాస కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. పేదల కోసం దాడులు ఎదుర్కొనేందుకు మేం సిద్ధమే. మా కార్యకర్తలు పది మంది తలకాయలు పగిలాయి. 77 మంది వరకు గాయపడ్డారు. చేతుల్లో కట్టెలు, రాళ్లతో ఉన్నవాళ్లు రైతులా? సీఎం సమాధానం చెప్పాలి. మాపై తెరాస కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తెరాస పోలీసింగ్‌ అయ్యింది’’ అని సంజయ్‌ విమర్శించారు.

అధిష్ఠానానికి నివేదిక

ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి తెలుసుకోవడానికి బండి సంజయ్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా జరిగిన ఘటనలపై భాజపా రాష్ట్ర శాఖ నివేదిక రూపొందించి జాతీయ పార్టీకి పంపించింది. ఘటనలకు సంబంధించి ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను జతచేశారు.


బండి సంజయ్‌ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై కేసులు

వేములపల్లి, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై మరో కేసు నమోదైంది.సంజయ్‌ ఈ నెల 15న నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో ఓ రైస్‌మిల్లు వద్దకు వచ్చారు. ఆ సమయంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై సంజయ్‌ను ఏ1గా చేర్చుతూ భాజపా, తెరాస కార్యకర్తలపై  కేసులు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్సై డి.రాజు తెలిపారు.  

* స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించీ బండి సంజయ్‌పై కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట నుంచి చివ్వెంల వరకు భారీ కాన్వాయ్‌తో వెళ్లినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాసు తెలిపారు. ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, ఆత్మకూర్‌ (ఎస్‌), తిరుమలగిరి, మద్దిరాల తదితర మండలాల్లోనూ కేసులు నమోదైనట్లు సమాచారం.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని