Updated : 17/11/2021 05:05 IST

KCR: 18న మహాధర్నా

నాతో సహా మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులందరం పాల్గొంటాం

  ధాన్యం సేకరణపై స్పష్టతకు ప్రధానికి లేఖ  

  రెండు రోజులు గడువిస్తాం.. స్పందించకుంటే వెంటాడి వేటాడతాం

  రైతుల్ని గోస పెట్టిన భాజపాకు శిక్ష తప్పదు

  నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం

  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

  యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నేను అడుగుతున్నా.. రైతులు, తెరాస నిన్ను నిలదీస్తే తప్పేంటి? అడిగితే నువ్వు దాడులు చేస్తున్నవ్‌.. రాళ్లతో కొట్టిస్తున్నవ్‌. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న బాధ్యతారాహిత్యంగా యాసంగిలో వరి వేయమన్నది నిజమా? కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలి. నీకు నిజాయతీ ఉంటే.. వరి వేయకండి అని చెప్పాలి. వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందో లేదో స్పష్టం చేయాలి.

- సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే ఈ ధర్నాలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం గవర్నరుకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ధాన్యంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని, సంవత్సరానికి ఎఫ్‌సీఐ సేకరణ లక్ష్యమేంటో రెండు, మూడు రోజుల్లో చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తామన్నారు. తమకు వెంటనే సమాధానం కావాలన్నారు. రైతులను ఆగం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. వరిసాగుకు గడువు సమీపిస్తోందని, ఈనెల 18 తర్వాత రెండురోజుల్లో కేంద్రం నుంచి స్పందన లేకుంటే వెంటాడి, వేటాడతామన్నారు. రైతులను గోస పెట్టినందుకు భాజపాకు శిక్ష తప్పదని చెప్పారు. తెలంగాణలో వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, యాసంగి పంటలకు రైతుబంధు డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఈ దుర్మార్గుల్ని నమ్మితే నష్టపోయే ప్రమాదం ఉన్నందున యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తిచేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోతే ఆందోళనలను కొనసాగిస్తూనే ఈ నెల 20 వరకు చూసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు ఇస్తామని తెలిపారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం మంత్రులు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు.

‘వరి ధాన్యంపై భాజపా, కేంద్రం వైఖరి.. ముక్కు ఎక్కడ అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు ఉంది’

అని తన వేలును ముక్కుపై పెట్టుకుని తల చుట్టూ తిప్పి చూపిస్తున్న కేసీఆర్‌

చేతులెత్తేసిన కేంద్రం

‘‘ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసింది. రైతు ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం దానికి లేదు. గత సీజనుకు సంబంధించిన 20 లక్షల టన్నుల ధాన్యం కేంద్రం తీసుకోక గోదాముల్లో మూలుగుతోంది. 62 లక్షల ఎకరాల్లో పంట ఉందని చెప్పినా ఎటూ తేల్చడంలేదు. రాష్ట్రం కొనే పరిస్థితి లేదు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ ధాన్యం నిల్వ చేసే పరిస్థితి ఉండదు. ధాన్యాన్ని కొనడం, దేశ అసరాల కోసం బఫర్‌ స్టాక్‌ నిర్వహించడం కేంద్రం బాధ్యత. కేంద్రం పంజాబ్‌లో వడ్లు మొత్తం కొంటోంది. మన దగ్గర మాత్రం కొనడం లేదు. దిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి మీ పద్ధతి బాగాలేదని చెప్పా. మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో ఏడాది ముందే చెప్పమన్నాం. దీనిపై స్పష్టత వచ్చే వరకూ నేను ఇక్కడే ఉంటానన్నా. ఐదారు రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడి చెబుతామన్నారు. ఇప్పటి వరకూ ఉలూకూ పలుకూ లేదు.

రైతులపై దాడులను సహించం

వానాకాలం పంటల కొనుగోలుకు 6,600కు పైగా కేంద్రాలు ప్రారంభించాం. భాజపా అక్కడికి వెళ్లి నాటకాలు మొదలుపెట్టింది. వరి వేయాలో వద్దో చెప్పకుండా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే రాళ్లతో దాడులు చేస్తున్నారు. రైతులపై దాడులను సహించం. సంవత్సరం కాలంగా దిల్లీలో ధర్నాలు చేస్తే, వారిపై కార్లు ఎక్కించి చంపుతున్నారు.  ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు. మా ధాన్యం కొంటారా లేదా అని సూటిగా అడుతుంటే సమాధానం చెప్పకుండా రాజకీయం చేస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఊరుకోదు. తెరాసకు 60 లక్షల మంది సభ్యులు న్నారు. వారిలో కొన్ని లక్షలమంది రైతులు. వారు నిలదీస్తుంటే రాళ్లతో కొడుతున్నారు. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నం. రైతులపై దాడి చేసిన వారిపై కేసులు పెడతారు. వారికి తగిన శిక్ష పడుతుంది. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ చట్టాలను వద్దన్నాం. సాగు చట్టాలను వ్యతిరేకించాం. వచ్చే శాసనసభ సమావేశాల్లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.


 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని