Updated : 14/11/2021 04:21 IST

Manipur terror attack: మణిపుర్‌లో ఉగ్రదాడి

  కమాండింగ్‌ అధికారి, భార్య, కుమారుడు సహా ఏడుగురి దుర్మరణం

  అస్సాం రైఫిల్స్‌ అధికారి వాహనమే లక్ష్యంగా మెరుపు దాడి

  రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

ఉగ్ర ఘాతుకానికి బలైన కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి దంపతులు

ఇంఫాల్‌, దిల్లీ, ఈనాడు-గువాహటి: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. కుటుంబంతో కలిసి వెళుతున్న సైనిక అధికారి వాహనమే లక్ష్యంగా ఐఈడీల(అధునాతన పేలుడు పరికరం)తో దాడికి పాల్పడ్డారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ మెరుపు దాడిలో మొత్తం ఏడుగురు మరణించారు. అస్సాం రైఫిల్స్‌ 46వ(ఖూగా) బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయం వాహనంలో ప్రయాణిస్తున్నారు. మిలిటెంట్లు చురాచాంద్‌పుర్‌ జిల్లాలోని సెహకాన్‌ గ్రామం వద్ద ఆ వాహనమే లక్ష్యంగా ఐఈడీలను పేల్చారు.  అనంతరం సమీపంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి తూటాల వర్షం కురిపించారు. త్రిపాఠి బెహియాంగ్‌ కంపెనీ నుంచి బేస్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సిబ్బంది తీవ్రవాదుల కాల్పులను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పేలుళ్ల తీవ్రతకు త్రిపాఠి(41)తోపాటు ఆయన భార్య అనుజ (34), కుమారుడు అబిర్‌ (5), నలుగురు సిబ్బంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనంటూ నిషేధిత పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ), మణిపుర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌పీఎఫ్‌)లు శనివారం రాత్రి ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన త్రిపాఠి, ఇతర సిబ్బంది కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రాష్ట్ర బలగాలు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. మిజోరంలో పనిచేసే త్రిపాఠి ఈ ఏడాది జులైలో మణిపుర్‌కు బదిలీ అయ్యారు.

చిన్నారి అబిర్‌ త్రిపాఠి

* తీవ్రవాదుల దాడిలో త్రిపాఠిసహా ఏడుగురు మరణించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తీవ్రవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండించారు. 

2018లోనూ..

మణిపుర్‌లోని చందేల్‌ జిల్లాలో జూన్‌ 4, 2018న సైన్యం వాహనశ్రేణిపై ఈ తరహా దాడే జరిగింది. ఆర్మీలోని 6 డోగ్రా రెజిమెంట్‌కు చెందిన 18 మంది సిబ్బంది ఆ దాడిలో మరణించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో దాదాపుగా ప్రశాంతత నెలకొంది.

హెలికాప్టర్‌లో క్షతగాత్రుల తరలింపు

చైనాతో సంబంధాలు

మణిపుర్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ తిరుగుబాటు సంస్థలకు చైనాతో సంబంధాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయా సంస్థల సభ్యులకు ఆయుధాలను సమకూర్చడం లేదా గెరిల్లా తరహా పోరాటాలపై శిక్షణ వంటి విషయాల్లో డ్రాగన్‌ దేశం నుంచి సహకారం లబిస్తోంది. నిషేధిత పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కాంగ్లిపాక్‌ (పీఆర్‌ఈపీఏకే) ఏటా నవంబరు 13ని బ్లాక్‌డేగా పాటిస్తుంది. నవంబరు 12, 1978న సీఆర్‌పీఎఫ్‌, మణిపుర్‌ రాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పీఆర్‌ఈపీఏకే అగ్రనేతలు కొందరు మరణించారు. అప్పటి నుంచి నవంబరు 13ని ఆ సంస్థ బ్లాక్‌డేగా పాటిస్తోంది. మరోవైపు, ఈ ప్రాంతంలో పీఆర్‌ఈపీఏకే ఉనికి దాదాపుగా లేనట్లే. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) అనే సంస్థ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి చురాచాంద్‌పుర్‌ జిల్లాలో మయన్మార్‌ వైపు సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో రెండు శిబిరాలు ఉన్నాయి. కేడర్‌, ఆయుధాల పరంగా చూస్తే పీఆర్‌ఈపీఏకే గతంలో బలంగా ఉండేది. ప్రస్తుతం పీఎల్‌ఏ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 2011 జులైలో మణిపుర్‌లోని వేర్పాటువాద సంస్థలు కోఆర్డినేషన్‌ కమిటీ-కోర్‌కామ్‌ పేరుతో సమాఖ్యగా ఏర్పడ్డాయి. ఈ కోర్‌కామ్‌లో పీఎల్‌ఏకు కూడా సభ్యత్వం ఉంది. శనివారం నాటి దాడిలో తమ ప్రమేయం కూడా ఉందని స్వయంగా ఆ సంస్థే వెల్లడించింది. మరోవైపు, ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దుల విషయమై భారత్‌-చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో పొరుగు దేశమైన మయన్మార్‌ తిరిగి సైనిక పాలనలోకి జారుకుంది. ఈశాన్య భారతంలో క్షీణత దిశగా పయనిస్తున్న తిరుగుబాటు సంస్థలు ఈ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి పుంజుకుని ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తాయనడం సుస్పష్టం.


 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని