MLC Elections: మరో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం!

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి

Updated : 26 Nov 2021 05:16 IST

వరంగల్‌, మహబూబ్‌నగర్‌లలో స్వతంత్రుల నామినేషన్ల ఉపసంహరణ
తెరాస అభ్యర్థులు శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, నారాయణరెడ్డిలకు మార్గం సుగమం

ఈనాడు, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలకు పోటీగా దాఖలైన నామినేషన్లను ఆయా అభ్యర్థులు గురువారం ఉపసంహరించుకున్నారు. దీంతో తెరాస అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. వరంగల్‌లో పోటీలో ఉన్న ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గురువారం తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో రెండు స్థానాలకు మూడు నామినేషన్లు ఉండగా.. తెరాస అభ్యర్థులు దామోదర్‌రెడ్డి, నారాయణరెడ్డిలకు మద్దతుగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

ఇప్పటికి 6 స్థానాలు ఏకగ్రీవం!
ఇప్పటికే నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మూడు స్థానాలు తెరాసకు ఏకగ్రీవం అవుతున్న విషయం తెలిసిందే. తాజా మూడు స్థానాలతో కలిసి వాటి సంఖ్య ఆరుకు చేరుతోంది. దీంతో మొత్తం 12 స్థానాలకుగాను సగం ఏకగ్రీవమయ్యాయి. మరిన్ని ఏకగ్రీవాలకు తెరాస ప్రయత్నిస్తోంది. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. గడువు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం తెరాస అభ్యర్థుల ఏకగ్రీవాలను ప్రకటించనుంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్న తెరాస అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంబీపూర్‌రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలను కేటీఆర్‌ అభినందించారు.  

మిగతా చోట్ల ఇలా..
* నల్గొండలో ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.ఆరుగురు పోటీలో మిగిలారు.

* ఆదిలాబాద్‌లో అయిదుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 18 మంది పోటీలో ఉన్నారు.

* కరీంనగర్‌లో 24మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

* ఖమ్మంలోనూ నలుగురు పోటీలో ఉన్నారు.

* మెదక్‌లో ఒకరు ఉపసంహరించుకోగా.. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

తెరాసకు గట్టు, రవీందర్‌సింగ్‌ల రాజీనామా  
తెరాస నేతలు గట్టు రామచందర్‌రావు, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌లు గురువారం పార్టీకి రాజీనామా చేశారు. గట్టు తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించారు. వైకాపా నుంచి తెరాసలోకి వచ్చిన గట్టు.. పార్టీలో తనకు ప్రాధాన్యం, పదవులు ఇవ్వలేదనే భావనతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రవీందర్‌సింగ్‌ తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు ఫ్యాక్స్‌ చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్న రవీందర్‌సింగ్‌ కరీంనగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.


రంగారెడ్డిలో రీషెడ్యూల్‌ చేయాలి: కాంగ్రెస్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియను రీషెడ్యూల్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అక్కడ నామినేషన్‌ వేయడానికి వెళ్లిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజపై దౌర్జన్యం చేసి, పత్రాలను చించివేసిన ఘటన నేపథ్యంలో తిరిగి ఆశావాహులందరికీ నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.  పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని