MLC Elections: ఏడుగురు సిట్టింగులు.. అయిదుగురు కొత్తవారు

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ముగియడంతో స్థానిక సంస్థల కోటా స్థానాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికలు జరిగే 12స్థానాలకు తెరాస అధిష్ఠానం సోమవారం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.  

Updated : 23 Feb 2024 12:00 IST

తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

నిజామాబాద్‌ స్థానం కల్వకుంట్ల కవితకే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ముగియడంతో స్థానిక సంస్థల కోటా స్థానాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికలు జరిగే 12స్థానాలకు తెరాస అధిష్ఠానం సోమవారం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.  ఏడు స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శంభీపూర్‌ (సుంకరి) రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలకు, అయిదింటిలో కొత్త అభ్యర్థులు మాజీ మంత్రి ఎల్‌.రమణ, పార్టీ నేతలు దండె విఠల్‌, తాత మధు, డాక్టర్‌ యాదవరెడ్డి, ఎంసీ కోటిరెడ్డిలకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా, ఆయా జిల్లాల్లో సమీకరణాలు, పార్టీ భవిష్యత్తు అవసరాలు, అనుభవం, సేవలు, విధేయత, సమర్థత వంటి వాటిని పరిగణనలోనికి తీసుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. టికెట్‌ దక్కని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించే వీలుంది.

ఆరు నామినేషన్ల దాఖలు

అభ్యర్థుల ఎంపికపై సోమవారం అధికారికంగా ఆయా అభ్యర్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం సమాచారం అందించింది. దీంతో రంగారెడ్డి, వరంగల్‌, మెదక్‌, ఖమ్మం తెరాస అభ్యర్థులుగా శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ యాదవరెడ్డి, తాత మధు నామినేషన్లు వేశారు. కరీంనగర్‌లో భానుప్రసాద్‌రావు తరఫున నామినేషన్‌ దాఖలైంది.

నేడు మరో ఆరుగురు..

మంగళవారం నామినేషన్లకు తుది గడువు కాగా నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్‌లో  కూచికుంట్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్‌లో దండె విఠల్‌, కరీంనగర్‌లో ఎల్‌.రమణ నామినేషన్లు వేస్తారు. కరీంనగర్‌లో భానుప్రసాద్‌రావు మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారు.


మండలి వైపే కవిత మొగ్గు

ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత మరోసారి శాసనమండలికి పోటీ చేసేందుకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. బండా ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు వెళతారనే ప్రచారం సాగినా.. ఆమెను శాసనమండలికి పంపడానికే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం వచ్చే జనవరి 4తో ముగుస్తోంది. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీలో ఒకదానిపై ఉత్కంఠ ఏర్పడగా... చివరికి ఎమ్మెల్సీ టికెట్‌నే సీఎం ఖరారు చేశారు. పార్టీ భవిష్యత్తు అవసరాలు, 2024లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఆమెకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2014లో నిజామాబాద్‌లో ఎంపీగా ఎన్నికైన ఆమె 2019 వరకు అదే పదవిలో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2020 అక్టోబరులో నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని