Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై అదే అస్పష్టత

ధాన్యం కొనుగోళ్ల విషయంలో అస్పష్టత తొలగిపోలేదు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌

Updated : 24 Nov 2021 11:00 IST

కేంద్ర మంత్రి గోయల్‌తో భేటీలో లభించని హామీ

ఏడాదికి ఒకేసారి కొనుగోళ్ల లక్ష్యం నిర్దేశించాలని రాష్ట్ర బృందం వినతి

26న మరోసారి సమావేశం

దిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌

ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అస్పష్టత తొలగిపోలేదు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డిల నేతృత్వంలోని బృందం విన్నవించగా.. స్పష్టమైన హామీ లభించలేదు. కేంద్ర మంత్రిని దిల్లీలోని కృషి భవన్‌లో రాష్ట్ర బృందం మంగళవారం సాయంత్రం కలిసింది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ఏడాదికి 120 లక్షల నుంచి 150 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం(100-120 ఎల్‌.ఎం.టి.ల బియ్యం) సేకరించాలని కేంద్ర మంత్రి గోయల్‌కు రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. 23 రకాల పంటలకు సంబంధించి ముందుగానే కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించినట్లుగా... ఏడాదికి ఒకేసారి లక్ష్యం నిర్దేశించాలని, వానాకాలం, యాసంగిలకు వేర్వేరుగా లక్ష్యాలు వద్దని కోరారు. పంజాబ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు పండిన పంటలో 90 శాతం కొనాలని విజ్ఞప్తి చేశారు. ఒక దశలో 60 నుంచి 70 ఎల్‌ఎంటీ వరకు బియ్యం కొనుగోలుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని, ఉప్పుడు బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది.  అయితే ఒప్పందం ప్రకారం.. గతేడాదికి సంబంధించి బ్యాలెన్స్‌గా 5.25 ఎల్‌ఎంటీల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఏడాది లక్ష్యాన్ని ఒకేసారి నిర్దేశిస్తే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా రైతులను ఒప్పిస్తామన్నట్లు తెలంగాణ బృందం చెప్పినట్లు తెలియవచ్చింది. సాయంత్రం 6.40 నుంచి 7.50 గంటల వరకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు సాగాయి.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. 

 చిత్రంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు

సమావేశం మధ్యలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ రాష్ట్ర బృందం వెల్లడించిన అంశాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో మాట్లాడారు. గంటకుపైగా సమావేశం కొనసాగినా ఏఒక్క అంశంపైనా పూర్తిస్థాయిలో వీరిమధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి మరోసారి కలుస్తామని రాష్ట్ర మంత్రులు గోయల్‌కు తెలిపారు. ఈ నెల 26న మరోసారి భేటీ అవుదామని కేంద్ర మంత్రి సూచించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోని బృందం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రితో భేటీ అయిన బృందంలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు. కేంద్ర మంత్రితో సమావేశంలో చర్చించిన అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈనెల 26న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మరోసారి కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తన నివాసంలో విందు ఇచ్చారు.

సురేష్‌రెడ్డి ఇంట విందుకు హాజరైన సీఎం కేసీఆర్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు

3 గంటలకు పైగా నిరీక్షణ

కేంద్ర మంత్రి గోయల్‌ను కలుసుకునేందుకు రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోని బృందం అపాయింట్‌మెంట్‌ కోరగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫోన్‌ చేసి రావాలని కార్యాలయాధికారులు తెలిపారు. అయితే అదే సమయానికి రాష్ట్ర బృందం గోయల్‌ కార్యాలయానికి చేరుకుంది. భారత్‌-అమెరికా ట్రేడ్‌ పాలసీ ఫోరం ద్వైపాక్షిక సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి.. సాయంత్రం 6.40 గంటలకు తన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటివరకు సుమారు 3.40 గంటల పాటు రాష్ట్ర బృందం నిరీక్షించాల్సి వచ్చింది.

కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు నమస్కరిస్తున్న కేటీఆర్‌, చిత్రంలో పీయూష్‌ గోయల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు