Updated : 20/11/2021 05:29 IST

Modi: జై కిసాన్‌

సాగు చట్టాల రద్దు

ప్రధాని సంచలన ప్రకటన

జాతికి క్షమాపణ

నెలాఖరులోగా రాజ్యాంగ ప్రక్రియ పూర్తి

రైతుల మేలు కోసమే వీటిని పవిత్ర మనసుతో తెచ్చామని వెల్లడి

కొందరికి నచ్చజెప్పలేకే రద్దు చేస్తున్నట్టు వివరణ

పార్లమెంటు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆందోళన కొనసాగుతుందన్న రైతు నేతలు

5 రాష్ట్రాల ఎన్నికల దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విపక్షాల ఆక్షేపణ


దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. మంచి మనసుతో, పవిత్ర హృదయంతో ఓ విషయం చెప్పదలచుకున్నా. బహుశా మా తపస్సులో ఏదో లోపం ఉండి ఉండొచ్చు. అందుకే దీపం లాంటి సత్యం గురించి కొందరు రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. ఈరోజు గురునానక్‌ దేవ్‌ పవిత్ర ప్రకాశ దినోత్సవం. ఇది ఎవర్నీ తప్పుపట్టే సమయంకాదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం.

అన్నదాతల పరిస్థితులను మెరుగుపరిచేందుకే మూడు సాగు చట్టాలను తెచ్చాం. బడుగు రైతులకు మరింత శక్తినివ్వాలని, వారి ఉత్పత్తులకు మంచి ధరలు దక్కేలా చేయాలనే వీటిని రూపొందించాం. రైతులు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తల నుంచి ఏళ్ల తరబడి వినిపించిన డిమాండే ఇది. గత ప్రభుత్వాలెన్నో వీటిపై మథనం చేశాయి. కానీ, మేము పార్లమెంటులో చర్చించి, వీటిని తీసుకొచ్చాం.

మేం ఏంచేసినా అది రైతుల కోసమూ, దేశం కోసమే. మీ అందరి ఆశీర్వాదంతో నా శ్రమలో లోపం లేకుండా చూసుకున్నా. మీ కలలు, దేశం కలలు సాకారం చేయడానికి ఇకముందూ మరింత శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నా.

- ప్రధాని మోదీ


ఈనాడు, దిల్లీ: అన్నదాతల అలుపెరగని పోరాటం ఫలించింది. అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. జాతికి క్షమాపణ చెప్పారు. దిల్లీ సరిహద్దుల్లో సుమారు ఏడాది కాలంగా నిరసన చేపడుతున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని అభ్యర్థించారు. రైతు సంఘాల నేతలు మాత్రం ఈ ప్రకటనను గిమ్మిక్కుగా పేర్కొన్నారు. చట్టాల రద్దుకు సంబంధించిన పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయ్యేవరకూ తాము కదిలేది లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలూ విమర్శలను సంధించాయి. సాగుచట్టాల రద్దును ఇంతకాలం తాత్సారంచేసిన మోదీ సర్కారు... త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డాయి.

సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వీటిని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఈనెల 26 నాటికి ఏడాది పూర్తికానున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని, అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

‘‘ఈ దేవ్‌ దీపావళి, గురునానక్‌దేవ్‌ పవిత్ర ప్రకాశపర్వం. ఏడాదిన్నర తర్వాత కర్తార్‌పుర్‌ కారిడార్‌ మళ్లీ తెరిచారు. ప్రపంచంలో సేవా మార్గాన్ని ఎంచుకుంటేనే జీవితం సఫలమవుతుందని గురునానక్‌ చెప్పారు. మా ప్రభుత్వం ఈ సేవాభావంతోనే దేశ ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయిదు దశాబ్దాల ప్రజాజీవితంలో నేను రైతుల ఇబ్బందులను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చాలా సూక్ష్మంగా చూశా. వాటి కారణంగా ఎదురయ్యే కష్టాలను అర్థం చేసుకున్నా. అందుకే దేశం నాకు 2014లో ప్రధానమంత్రి హోదాలో సేవచేసే అవకాశం ఇచ్చింది. నాటి నుంచి వ్యవసాయ అభివృద్ధికి, అన్నదాత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం.

80% మంది సన్నకారు రైతులే...

వంద మంది అన్నదాతల్లో 80 మంది సన్నకారు రైతులే. వీరి సంఖ్య పది కోట్లకుపైనే ఉంది. ఈ రైతుల వద్ద రెండు హెక్టార్లకు మించి భూమి ఉండదన్నది నిజం. వారి ప్రపంచం, జీవనాధారం ఆ చిన్న భూమి ముక్కే. దాని సాయంతోనే వారు, వారి కుటుంబ సభ్యులు బతుకులను నెట్టుకొస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య తరతరాలుగా సాగే ఆస్తుల పంపిణీతో ఆ కమతాలు మరింతగా కుంచించుకుపోతున్నాయి. అందుకే సన్నకారు రైతుల కష్టాలను దూరం చేసేందుకు విత్తనాలు, బీమా, మార్కెట్లు, బడ్జెట్‌పై నలువైపులా పనిచేశాం. మేలురకం విత్తనాలను అందించడంతోపాటు... వేపపూత యూరియా, భూసార పరీక్షలు, సూక్ష్మసేద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చాం. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను రైతులకు ఇచ్చాం. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది. ఫసల్‌ బీమా యోజనను మరింత ప్రభావశీలం చేశాం. ఎక్కువమంది రైతులను దాని పరిధిలోకి తెచ్చాం. నిబంధనలను సరళీకరించి, ఇబ్బందులు పడుతున్న రైతులకు సులభంగా పరిహారం చెల్లించాం. గత నాలుగేళ్లలో వారికి రూ.లక్ష కోట్ల పరిహారం అందింది.

బడ్జెట్‌ అయిదింతల పెంపు

చిన్న, సన్నకారు రైతులు మొదలు వ్యవసాయ కూలీల వరకూ అందరికీ బీమా, పింఛను సౌకర్యాలు తీసుకొచ్చాం. బడుగు రైతుల ఖాతాల్లో రూ.1.62 లక్షల కోట్లు వేశాం. వారి పంటలకు సరైన ధరలు లభించేలా ఎన్నో చర్యలు తీసుకున్నాం. గ్రామీణ మార్కెట్‌ను బలోపేతం చేశాం. కనీస మద్దతుధరను పెంచాం. రికార్డుస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, మునుపెన్నడూ లేనంతగా పంటలను కొనుగోలు చేశాం. వెయ్యికిపైగా మండీలను ఈ-నామ్‌ పథకంతో జోడించి... రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వేదిక కల్పించాం. వ్యవసాయ మండీల ఆధునికీకరణకు కోట్ల రూపాయలు ఖర్చుచేశాం. వ్యవసాయ బట్జెట్‌ను అయిదు రెట్లు పెంచాం. ఏటా రూ.1.25 లక్షల కోట్లకుపైగా వ్యవసాయంపై ఖర్చు చేస్తున్నాం. రూ.లక్ష కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టు ద్వారా గోదాముల నిర్మాణం, వ్యవసాయ పనిముట్ల లభ్యత వంటి పనులను చేపడుతున్నాం. బడుగు రైతులను శక్తిమంతులను చేయడానికి పది లక్షల వ్యవసాయ ఉత్పత్తి సంఘాలను ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు రూ.7 వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. సూక్ష్మసేద్య విస్తరణకు బడ్జెట్‌ను రెండింతలు చేసి, రూ.10 వేల కోట్లు కేటాయించాం. పంట రుణాలనూ రెండురెట్లు చేశాం. ఈ ఏడాది రూ.16 లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నాం.

రైతు హితం కాంక్షించే సాగు చట్టాలు

అన్నదాతల హితం కోసం  నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు పూర్తి బాధ్యతతో పనిచేస్తున్నాం. ఇందులో భాగంగానే మూడు సాగు చట్టాలను తీసుకొచ్చాం. చిన్న రైతులకు మరింత శక్తినివ్వాలని, వారి ఉత్పత్తులను అమ్ముకొనేందుకు సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తెచ్చి, వాటికి మంచి ధరలు దక్కేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలను రూపొందించాం. పార్లమెంటులో చర్చించాకే వీటిని ఆమోదించాం. రైతు సంఘాలతోపాటు కోట్లమంది రైతులు వీటిని స్వాగతించారు. వారందరికీ ధన్యవాదాలు.

అర్థం చేసుకోలేకపోయారు...

చిన్న రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ హితం కోసం, పల్లెల ఉజ్వల భవిష్యత్తు కోసం పూర్తి సత్యనిష్ఠ, సమర్పణభావం, విస్పష్ట విధానంతో ఈ చట్టాలు తీసుకొచ్చాం. కానీ, కొందరు రైతులకు నచ్చజెప్పలేకపోయాం! అన్నదాతల్లో ఒక వర్గం వీటిని వ్యతిరేకిస్తూ వచ్చింది. వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు ఈ చట్టాల వల్ల జరిగే మేలు గురించి వివరించేందుకు ప్రయత్నించారు. మేం కూడా పూర్తి వినమ్రతతో, పెద్ద మనసుతో వారికి నచ్చజెబుతూనే వచ్చాం.  రైతుల అభిప్రాయాలను, వాటిలోని తర్కాన్ని అర్థం చేసుకోవడానికున్న ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. ఈ చట్టాల్లోని నిబంధనలను మార్చేందుకు సంసిద్ధత తెలిపాం. రెండేళ్లు వీటిని సస్పెండ్‌ చేస్తామన్నాం. ఈ విషయం సుప్రీంకోర్టుకూ వెళ్లింది.

త్వరలోనే రాజ్యాంగ ప్రక్రియ పూర్తి

ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోనే మూడు సాగు చట్టాలను రద్దుచేసే రాజ్యాంగ ప్రక్రియను పూర్తిచేస్తాం. ఆందోళన చేస్తున్న రైతులంతా గురుపూరబ్‌ పవిత్ర దినోత్సవం నాడు ఇళ్లకు, కుటుంబ సభ్యుల వద్దకు, పొలాలకు తిరిగి వెళ్లాలని కోరుతున్నా.

ప్రకృతి వ్యవసాయం బలోపేతానికి కమిటీ

వ్యవసాయ రంగంతో ముడిపడిన మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. జీరో బడ్జెట్‌ సాగుకు మద్దతివ్వడానికి, పంటల రకాలను శాస్త్రీయంగా మార్చడానికి, కనీస మద్దతు ధర నిమిత్తం మరింత పారదర్శకంగా పనిచేయడానికి, ప్రకృతి వ్యవసాయం బలోపేతానికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఉంటారు. అన్నదాతల సంక్షేమం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. మున్ముందూ దాన్ని కొనసాగిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.


ఆ మూడింటిపై దృష్టి పెట్టండి

- ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ హరిత విప్లవ పితామహుడు

వ్యవసాయ చట్టాల రద్దుపై సంతోషంగా ఉన్నా. ఉత్పత్తి వ్యయానికి మించి 50 శాతం అదనంగా ఆదాయం వచ్చేలా మద్దతు ధర ఉండాలని నొక్కి చెబుతున్నా. జాతీయ వ్యవసాయదారుల కమిషన్‌ సమర్పించిన నివేదికలో కీలకాంశం కూడా ఇదే. ‘ఉత్పత్తి, సేకరణ, ధరలు’పైనే వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ మూడు కోణాల్లో ఏకకాలంలో చర్యలు తీసుకోవాలి.


ఓటమి భయంతోనే వెనక్కి

దిల్లీ: కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు ప్రతిపక్షాలు రైతుల్ని అభినందించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే భాజపా సర్కారు వెనక్కి తగ్గిందని అభిప్రాయపడ్డాయి. మొదట్లోనే అహంకారాన్ని విడిచిపెట్టి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాయి. అలా చేసి ఉంటే ఎన్నో ప్రాణాలు మిగిలి ఉండేవని పేర్కొన్నాయి.


కుట్రల భగ్నం

రైతులు, కూలీల జీవనోపాధికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్నవారు జరిపిన కుట్రలు భగ్నమయ్యాయి. నియంతల అహంకారం ఓడిపోయింది. రైతుల పోరాటం, సత్యం, అహింస గెలిచాయి.

-సోనియా గాంధీ


అన్యాయంపై విజయం

రైతులు సత్యాగ్రహం చేసి అహంకారం తలవంచుకునేలా చేశారు. ఇది అన్యాయంపై సాధించిన విజయం. 

-రాహుల్‌ గాంధీ


వాస్తవమేమిటో చూశారు

ఇప్పటికైనా దేశంలోని వాస్తవ పరిస్థితి ఏమిటో చూశారు. ఈ దేశాన్ని రైతులు నిర్మించారు. ఇది రైతుల దేశం. వారి ప్రయోజనాలను దెబ్బతీసి ఏ ప్రభుత్వమూ దేశాన్ని నడపలేదు.

- ప్రియాంకా గాంధీ వాద్రా


రైతులకు సెల్యూట్‌

ప్రజాస్వామ్య పంథాలో ఆందోళన చేసిన రైతులకు నా సెల్యూట్‌

- దేవెగౌడ, మాజీ ప్రధాని


ఇంకో ప్రభుత్వం ఇలా చేయదు

రైతులకు లభించిన చరిత్రాత్మక విజయం. భాగస్వాములతో చర్చించకుండా చట్టాలను తీసుకొచ్చింది. ఇది చూశాక మరో ప్రభుత్వం ఇంతటి కఠినత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శించదు.

-ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, శిరోమణి అకాలీదళ్‌


మరికొన్ని క్షమాపణలు చెప్పాలి

నిరంకుశత్వంతో తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నో కష్టాలు కలిగించారు. సన్నిహిత పారిశ్రామికవేత్తల కోసమే ఈ చట్టాలు తెచ్చారు.  ఇందుకు కూడా ప్రధాని క్షమాపణలు చెప్పాలి.

-సీతారాం ఏచూరి, సీపీఎం


పోరాటాన్ని మరిచిపోలేరు

రైతులు ఏడాది పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీన్ని మరిచిపోలేరు.

-శరద్‌ పవార్‌, ఎన్‌సీపీ


ప్రధానిది తప్పుడు క్షమాపణ

ప్రధాని చెప్పినది తప్పుడు క్షమాపణ. ప్రజలు అంతా అర్థం చేసుకున్నారు. భాజపాకు తగిన గుణపాఠం చెబుతారు.

-అఖిలేశ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ


త్యాగాలు ఫలించాయి

రైతుల త్యాగాలు ఫలితమిచ్చాయి. ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది.

- మాయావతి, బీఎస్పీ


సదుద్దేశమేమీ లేదు

ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొందని భావిస్తే పొరపాటే. కేవలం ఎన్నికల ఫలితాలకే అది స్పందిస్తుంది.

-ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌


ఆలస్యమైనా మంచి నిర్ణయమే  

రైతు వ్యతిరేక చట్టాల రద్దు ఆలస్యమైనా మంచి నిర్ణయమే. ఉద్యమిస్తే ఫలితాలు పక్కాగా వస్తాయని, పోరాటాలతో విజయం సాధించవచ్చని రైతులు నిరూపించారు. పాపం చేసి క్షమాపణలు చెప్పడానికి ప్రధానమంత్రికి ఇన్ని నెలలు పట్టిందా? 

-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి 


ప్రభుత్వ మొండితనంతోనే ఆందోళన

మొదటి నుంచీ వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవే. ప్రభుత్వ అహంభావం కారణంగానే రైతులు వీధుల్లోకి వచ్చారు. మొండిగా వ్యవహరించకుండా ఉండి ఉంటే 700కుపైగా ప్రాణాలు పోయి ఉండేవి కావు.

-అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం


మార్పులను ఒప్పించలేకపోయాం

రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రధాని ఈ చట్టాలను ప్రతిపాదించారు. ఇవి అమలయి ఉంటే తప్పకుండా వారి జీవితాలు మారేవి. కానీ రైతులకు నచ్చజెప్పడంలో విఫలమయ్యాం.

-నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర వ్యవసాయ మంత్రి


రాజనీతిజ్ఞత ప్రదర్శించిన ప్రధాని

సాగు చట్టాలపై ప్రధాని ప్రకటనను స్వాగతిస్తున్నా. ఇది రాజనీతిజ్ఞ తరహా అడుగు. ప్రధాన మంత్రి ఈ ప్రకటన కోసం గురుపూరబ్‌ దినోత్సవాన్ని ఎంచుకోవడం ప్రత్యేకం. ఆయన అద్భుతమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించారు.

- అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి


 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని