China: అమెరికాను తలదన్నిన చైనా

ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అనగానే గుర్తొచ్చేది... అమెరికా! సంపదలో, పలుకుబడిలో, శక్తిసామర్థ్యాల్లో ఆ దేశానికి ఎదురులేదన్న భావన అందరిలోనూ ఉన్నదే. ఇప్పుడా

Updated : 17 Nov 2021 13:02 IST

 అత్యంత సంపన్న దేశంగా అవతరణ

మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూయార్క్‌: ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అనగానే గుర్తొచ్చేది... అమెరికా! సంపదలో, పలుకుబడిలో, శక్తిసామర్థ్యాల్లో ఆ దేశానికి ఎదురులేదన్న భావన అందరిలోనూ ఉన్నదే. ఇప్పుడా ముద్రను చెరిపేసింది చైనా! అమెరికాను మించిన సంపదతో ప్రపంచ నంబర్‌-1గా అవతరించింది. జూరిక్‌లోని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన అధ్యయనం ఈ విషయాన్ని చాటిచెప్పింది. ప్రపంచ సంపదలో 60% వాటా కలిగిన తొలి పది దేశాల బ్యాలెన్స్‌ షీట్లను మెకిన్సే అండ్‌ కో అధ్యయనకర్తలు విశ్లేషించారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడింతలు కాగా... చైనా సంపద అమెరికాను మించి విపరీతంగా పెరిగిందని, నేడు ప్రపంచంలో డ్రాగనే నంబర్‌-1 అని నిర్ధారించారు. ఈ మేరకు వారు నివేదికను రూపొందించారు.

ఒక దేశ పౌరుల చేతిలోని ఆస్తుల మొత్తం విలువను నికర విలువ లేదా నికర సంపద అంటారు. 2000 సంవత్సరంలో మొత్తం ప్రపంచ పౌరుల నికర విలువ 156 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2020 వచ్చేసరికి అది 514 లక్షల కోట్ల డాలర్లకు పెరిగినట్టు మెకిన్సే అధ్యయనం తేల్చింది. దాని ప్రకారం- ప్రపంచ సంపదలో 60% పది దేశాల చేతుల్లోనే ఉంది. వాటిలోనూ చైనా దగ్గరే అత్యధిక సంపద పోగుపడింది. 2000లో 7లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ఆ దేశ నికర సంపద...2020 వచ్చేసరికి 120 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. మొత్తం ప్రపంచ సంపద వృద్ధిలో ఇది మూడో వంతుకు సమానం. ఇదే కాలంలో అమెరికా నికర సంపద రెట్టింపయి, 90లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా 2000లో సభ్యదేశంగా చేరినప్పటి నుంచి దాని సంపద పెరిగిపోతూ వస్తోంది.

ఆస్తుల లెక్కలివీ...

* నేడు ప్రపంచ నికర సంపదలో 68% స్థిరాస్తుల రూపంలోనే ఉంది. మిగతాది మౌలిక వసతులు, యంత్రాలు, యంత్ర సామగ్రి, మేధో హక్కులు, పేటెంట్ల రూపంలో పోగుపడింది.

* ప్రపంచ సంపదను లెక్కించడంలో ఫైనాన్స్‌ సంబంధ ఆస్తులను మెకిన్సే పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని లెక్కలోకి తీసుకుంటే అప్పులనూ గణించాల్సి ఉంటుంది.

* షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్‌ వంటి చరాస్తులను ఫైనాన్స్‌ సంబంధ ఆస్తులంటారు. భూములు, భవనాలు, వ్యాపార సరకులు వంటివి స్థిరాస్తులుగా వర్గీకరిస్తారు.

* ప్రపంచ, చైనా సంపద ప్రధానంగా స్థిరాస్తుల రూపంలోనే పెరిగింది.అమెరికాకన్నా చైనాలో స్థిరాస్తుల ధరలు విపరీతంగా పెరిగినందునే నేడు ప్రపంచంలో అత్యధిక నికరవిలువ కలిగిన దేశంగా డ్రాగన్‌ అవతరించింది.

ఆదాయ వృద్ధి కన్నా 50% ఎక్కువ

స్థిరాస్తుల ధరలు పెరగడం వాపే తప్ప బలుపు కాదు. నేడు స్థిరాస్తుల విలువలు ప్రజల సగటు ఆదాయవృద్ధి కన్నా 50% ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒక దేశ సంపద దాని స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రతిబింబించాలి. జీడీపీ పెరుగుదల వల్ల ఉపాధి, వ్యాపారాలు వికసించి అన్నివర్గాల ఆదాయమూ పెరుగుతుంది. స్థిరాస్తుల ధరలు మాత్రమే పెరిగితే, దానివల్ల సంపన్న కుటుంబాలకు తప్ప మిగతావారికి ప్రయోజనం ఉండదు. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. 

మరో పతనం ముందుందా?

ప్రపంచ సంపద స్థిరాస్తుల్లోకి కాకుండా పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడితే... అన్నివర్గాల ప్రజలకూ అభివృద్ధి ఫలాలు అంది, దేశాలు సర్వతోముఖ ప్రగతి సాధిస్తాయని మెకిన్సే నివేదిక పేర్కొంది. ఏదో ఒకనాడు స్థిరాస్తి ధరలు పతనమై ప్రపంచ సంపదలో మూడో వంతు హరించుకుపోతుందని మెకిన్సే నివేదిక హెచ్చరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని