TRS Dharna: నేడు తెరాస మహాధర్నా

వరిధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే

Updated : 18 Nov 2021 11:32 IST

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వైఖరిపై నిరసన
ముఖ్యమంత్రి సహా హాజరుకానున్న మంత్రులు, నేతలు
ఇందిరాపార్కు వద్ద భారీ ఏర్పాట్లు
అనంతరం గవర్నర్‌ను కలవనున్న సీఎం

ధర్నా వేదిక వద్ద మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌ రావు. పక్కన తలసాని, జోగురామన్న తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: వరిధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పాల్గొని ఆందోళనకు నేతృత్వం వహించనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లు  పాల్గొననున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాస చేపట్టిన ఆందోళనల్లో ఇది నాలుగోది  కాగా... కేసీఆర్‌ ధర్నాలో పాల్గొనడం ఇదే మొదటి సారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై తెరాస రాష్ట్రవ్యాప్త బంద్‌ను నిర్వహించింది. ఆ తర్వత కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్‌ బంద్‌లో పాల్గొని నిరసనలు తెలిపింది. తాజాగా రాష్ట్రంలో తలెత్తిన ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న తెరాస కేంద్రం ధోరణికి వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకుంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా మరోసారి సీఎం పిలుపునిచ్చి తానూ పాల్గొంటానని తెలిపారు. దీంతో పార్టీ శ్రేణులు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  విజయవంతం చేసేందుకు తెరాస భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఎంపీలతో మాట్లాడి ధర్నాకు రావాలని సూచించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. మంత్రులు తమ తమ జిల్లాల్లోని జడ్పీ, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, రైతుబంధు సమితి ఛైర్మన్లతో మాట్లాడి ధర్నాకు ఆహ్వానించాలని సూచించారు. ఉదయం పది గంటలకే అంతా ధర్నా చౌక్‌కు రావాలని నిర్దేశించారు. ధర్నాలో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావులు ప్రసంగించనున్నారు. ధర్నా కోసం ఇందిరాపార్కు వద్ద భారీ వేదికను ఏర్పాటు చేశారు. ధర్నా అనంతరం ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కాలినడకన రాజ్‌భవన్‌కు వెళతారని సమాచారం. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇందిరాపార్కు మార్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్‌ను  క్రమబద్ధీకరించనున్నారు.

రైతుల కోసమే ధర్నా

కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలు, రైతుల హక్కులు, ప్రయోజనాల కోసమే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తలసానితో కలిసి ఆయన ఇందిరాపార్కు వద్ద మాట్లాడారు. ‘‘ తెరాస  ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా.. ప్రజల పక్షానే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు పండించిన ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం సేకరించి అవసరమైన రాష్ట్రాలకు సరఫరా చేయాలి.గత యాసంగి, వానాకాలం ధాన్యాన్ని కొనకుండా తెలంగాణపై వివక్ష చూపుతోంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వపక్షాన విన్నవించినా కేంద్రం స్పందించకపోవడం దారుణం. భాజపా నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. వారిని తగిన బుద్ధి చెబుతారు’’ అని హరీశ్‌రావు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని