వీఆర్‌ఏల నిరసనలో ఉద్రిక్తత

ఉద్యోగ క్రమబద్ధీకరణ, పేస్కేలు అమలు చేయాలని కోరుతూ శనివారం గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) చేపట్టిన ‘చలో సీసీఎల్‌ఏ కార్యాలయం’ కార్యక్రమం ఉద్రిక్తంగా ముగిసింది. అన్ని జిల్లాల నుంచి

Published : 22 May 2022 05:17 IST

సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద తోపులాట 
పలువురికి గాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ క్రమబద్ధీకరణ, పేస్కేలు అమలు చేయాలని కోరుతూ శనివారం గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) చేపట్టిన ‘చలో సీసీఎల్‌ఏ కార్యాలయం’ కార్యక్రమం ఉద్రిక్తంగా ముగిసింది. అన్ని జిల్లాల నుంచి బస్సులు, రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో నగరానికి తరలివచ్చిన వీఆర్‌ఏలను ఆయా మార్గాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని భూపరిపాలన ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పలువురిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకొనే క్రమంలో మహిళా వీఆర్‌ఏ సరోజను ఓ వాహనం ఢీకొట్టడంతో చేయి విరిగిందని, తలకు బలమైన గాయమైందని తోటి వీఆర్‌ఏలు తెలిపారు.  

శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్‌ 2020 సెప్టెంబరు 9న వీఆర్‌ఏలకు క్రమబద్ధీకరణ, పేస్కేలు ప్రకటించారని, వెంటనే అమలుచేయాలని సీసీఎల్‌ఏ కార్యదర్శి హైమావతికి వీఆర్‌ఏ ఐకాస నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐకాస అధ్యక్షుడు జి.రాజయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, పలుచోట్ల ఇతర నాయకులు మాట్లాడారు. ‘‘వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, అర్హత కలిగిన వారికి పదోన్నతి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇరవై నెలలు దాటినా అమలు చేయడంలేదు. విధుల్లో ఉన్నవారంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత కులాలకు చెందినవారు. ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం చాలక అర్ధాకలితో అలమటిస్తున్నారు. అప్పులపాలై అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’’ అని పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు వచ్చిన వీఆర్‌ఏలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖండించింది. హామీలను తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌ కోరారు. వీఆర్‌ఏలకు వీఆర్వోలు మద్దతు ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని