అందం కోసం.. బీట్‌రూట్ రసం..!

ఆరోగ్యంగా ఉండాలన్నా.. అందంగా కనిపించాలన్నా.. అది మనం తీసుకొనే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సౌందర్య నిపుణులు సైతం సూచిస్తూ ఉంటారు. ఈ విషయంలో మిగతా కూరగాయలు, పండ్లను కాసేపు పక్కన పెడితే బీట్‌రూట్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు.

Published : 26 Jan 2022 12:18 IST

ఆరోగ్యంగా ఉండాలన్నా.. అందంగా కనిపించాలన్నా.. అది మనం తీసుకొనే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే తాజా పండ్లు, కూరగాయలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సౌందర్య నిపుణులు సైతం సూచిస్తూ ఉంటారు. ఈ విషయంలో మిగతా కూరగాయలు, పండ్లను కాసేపు పక్కన పెడితే బీట్‌రూట్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. శరీరంలో రక్తవృద్ధి జరిగేలా చేసి, పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించడమే కాకుండా సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అందించడంలో దీనిని మించింది మరొకటి లేదు. అందుకే దీనితో రకరకాల పదార్థాలు తయారుచేసుకొని ఆహారంగా తీసుకొంటూ ఉంటారు. ఈ క్రమంలో- సౌందర్య పోషణలో కూడా బీట్‌రూట్ జ్యూస్ ఎంతగానో ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఆ ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చర్మం పొడిబారకుండా..

పలు కారణాల రీత్యా పొడిబారిన చర్మం బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా తిరిగి జీవకళను సంతరించుకొంటుంది. బీట్‌రూట్‌లో ఇనుపధాతువు, విటమిన్లు, ఖనిజలవణాలు.. మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి తగిన పోషణ అందించి ఆరోగ్యంగా మారేలా చేస్తాయి. అలాగే రక్తంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోయి శుద్ధి కావడం ద్వారా లోపలి నుంచి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే చర్మానికి తగినంత తేమనందిస్తూ పొడిగా మారకుండా సంరక్షిస్తుంది. రోజూ కాస్త బీట్‌రూట్ జ్యూస్‌ని ముఖానికి అప్త్లె చేసుకోవడం ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోయి మోము అందంగా వికసిస్తుంది.

మొటిమలు రాకుండా..

పెరిగిపోతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లలోని మార్పులు.. మొదలైన కారణాల వల్ల ప్రస్తుతం చాలామందికి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి. వీటి నుంచి విముక్తి కలిగించడంలో బీట్‌రూట్ బాగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి మొటిమలతో పాటు వాటి వల్ల ఏర్పడిన మచ్చలను కూడా తగ్గిస్తాయి. మరింత చక్కటి ఫలితం కోసం బీట్‌రూట్ జ్యూస్‌ని తాగడంతో పాటు.. అప్పుడప్పుడూ దానిని ముఖానికి కూడా అప్త్లె చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం చెంచా పెరుగులో, రెండు చెంచాల బీట్‌రూట్ జ్యూస్ కలిపి మచ్చలున్న చోట ఆ మిశ్రమం రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేస్తే ఆ మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.

నల్లని మచ్చలు పోగొట్టేలా..

కొందరికి వివిధ కారణాల వల్ల ముఖంపై నల్లని మచ్చలు వస్తుంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల క్రీములను సైతం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బీట్‌రూట్‌ని ఉపయోగించడం ద్వారా వాటిని సులభంగా తొలగించుకోవచ్చు. బీట్‌రూట్ జ్యూస్, టమాటా రసం కొద్దికొద్దిగా తీసుకొని మచ్చలపై రాసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయి. కొంతమందికి ఇంట్లోనే ముల్తానీమట్టితో ఫేస్‌ప్యాక్ వేసుకొనే అలవాటు ఉంటుంది. ఈ ప్యాక్‌లో కొద్దిగా బీట్‌రూట్ జ్యూస్‌ని కూడా కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే చర్మం కాంతిమంతంగా తయారవడంతో పాటు ముఖంపై ఉండే నల్లమచ్చలు కూడా తొలగిపోతాయి.

పెదవులు అందంగా..

అందమైన లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు, అనారోగ్య సమస్యలు.. మొదలైన కారణాల వల్ల పెదవులు పొడిగా, పగిలిపోయినట్లుగా తయారవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో పెదవులు తిరిగి అందంగా తయారయ్యేందుకు బీట్‌రూట్ చక్కగా ఉపకరిస్తుంది. అలాగే దీనిలో సహజంగా ఉండే గులాబీ రంగు కారణంగా అధరాలు కూడా సహజసిద్ధంగా గులాబీ రంగులోకి మారిపోతాయి. ఇందుకోసం బీట్‌రూట్ జ్యూస్‌ని పెదవులకు రాసుకొంటే సరిపోతుంది. అలాగే బీట్‌రూట్ రసంలో కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమంతో పెదవులపై మృదువుగా మర్దన చేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.

నల్లని వలయాలు పోగొట్టేలా..

పని ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడటంతో పాటు కళ్లు కాస్త ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. బీట్‌రూట్ జ్యూస్‌లో దూదిని ముంచి దానితో కనురెప్పలతో పాటు కళ్ల చుట్టూ అద్దుకొని కొంత సమయం అయిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా నల్లని వలయాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.

కురులు పెరుగుతాయి..

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా ఈ సమస్యని నివారించవచ్చు. బీట్‌రూట్‌లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా ఒత్తుగా ఎదిగేలా కూడా చేస్తుంది. దీనిలో ఉన్న ఎలక్ట్రోలైట్స్, ఐరన్ తదితర పోషకాలు పొడిబారిన జుట్టుని తిరిగి అందంగా మారుస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి బీట్‌రూట్ జ్యూస్ తాగడంతో పాటు.. మరో చిట్కాను సైతం పాటించాల్సి ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్‌ని కాస్త వేడి చేసి కుదుళ్ల నుంచి చివరి వరకు అప్త్లె చేసుకోవాలి. కొంత సమయం ఆగిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

సౌందర్యపరమైన ప్రయోజనాలు పొందడానికి బీట్‌రూట్ జ్యూస్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారుగా..! మీరూ ఓసారి ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.. అందంగా మెరిసిపొండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్