ఈ చిట్కాలతో శీతాకాలంలోనూ అందంగా..!

చలికాలం.. చాలామంది ఈ కాలాన్ని పెద్దగా ఇష్టపడరు. దీనికి ఇతరత్రా ఇబ్బందుల కంటే చలికాలంలో చర్మానికి ఎదురయ్యే సమస్యలే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. మిగిలిన కాలాల్లో అందంగా తయారై, నీట్‌గా డ్రస్ చేసుకునే అమ్మాయిలు ఈ కాలంలో స్వెటర్లు, క్యాప్‌లతో శరీరాన్ని, జుట్టును కవర్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటారు.

Updated : 21 Jan 2022 18:50 IST

చలికాలం.. చాలామంది ఈ కాలాన్ని పెద్దగా ఇష్టపడరు. దీనికి ఇతరత్రా ఇబ్బందుల కంటే చలికాలంలో చర్మానికి ఎదురయ్యే సమస్యలే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. మిగిలిన కాలాల్లో అందంగా తయారై, నీట్‌గా డ్రస్ చేసుకునే అమ్మాయిలు ఈ కాలంలో స్వెటర్లు, క్యాప్‌లతో శరీరాన్ని, జుట్టును కవర్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటారు. అయినా సరే.. చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో- చలికాలంలో ఏ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సౌందర్య నిపుణులు అందిస్తున్న కొన్ని ప్రత్యేక చిట్కాలు తెలుసుకుందాం రండి..

సన్‌స్క్రీన్ అత్యవసరం..

చలికాలం అనే కాదు.. కాలమేదైనా.. చర్మతత్వం ఎలాంటిదైనా సన్స్క్రీన్ లోషన్ అనేది చాలా అత్యవసరం. సన్‌స్క్రీన్ లోషన్ వల్ల చర్మం యూవీ కిరణాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ కిరణాల వల్ల చర్మం లోలోపల కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా వయసు పైబడినట్లుగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే బయటకు వెళ్లడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచిది. మాయిశ్చరైజర్ కలిసిన సన్‌స్క్రీన్ లోషన్ అప్త్లె చేసుకుంటే మరీ మంచిది.

పొడి చర్మం కోసం..

చర్మం కాస్త పొడిగా ఉన్నా చాలు.. చలికాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు కలబంద, క్యాక్టస్ లేదా నిమ్మ గుణాలతో రూపొందించిన క్లెన్సర్‌ని ఉపయోగించాలి. ఇవి చర్మానికి తేమను తిరిగి అందించడంతో పాటు వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాదు.. ఈ క్లెన్సర్స్‌ని వాడడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు కూడా త్వరగా తొలగిపోతాయి. అలాగే పొడి చర్మం ఉన్నవారు తరచూ మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకుంటూ ఉండడం వల్ల చర్మం పొడిబారిపోకుండా కాపాడుకోవచ్చు. ఇక రోజూ రాత్రి విటమిన్ ఈ క్యాప్సూల్స్ లేదా విటమిన్ ఎ, ఇ ఉన్న యాంటీ ఏజింగ్ క్రీమ్‌తో చర్మానికి మసాజ్ చేయాలి. గ్లిజరిన్ ఆధారిత సబ్బులు ఉపయోగించాలి.

మరీ పొడిగా ఉంటే..

చర్మం మరీ పొడిబారినట్లుగా మారిపోతే దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం కాస్త కష్టమైన పనే. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే అది సులువుగానే తిరిగి మామూలుగా మారిపోతుంది. చర్మం మరీ ఎక్కువ పొడిగా అనిపిస్తే సబ్బు ఉపయోగించడం మానేసి సున్నిపిండిని ప్రయత్నించండి. అలాగే నిమ్మరసం, పసుపు కలిపి చర్మానికి రుద్దుకొని ఆ తర్వాత స్నానం చేయండి. చర్మం మరింత పొడిబారకుండా ఇది కాపాడుతుంది. కోమలంగా కూడా మారుస్తుంది. స్నానం అవ్వగానే కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మకణాల్లో ఉన్న తేమ బయటకు పోకుండా కాపాడుకోవచ్చు. ఈ కాలంలో జుట్టు పాడయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కాబట్టి వారానికి రెండుసార్లు గోరువెచ్చని నూనెతో మర్దన చేసుకొని ఆపై తలస్నానం చేయాలి. దీనికి కూడా చాలా మైల్డ్ షాంపూని ఉపయోగించి స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా హెయిర్ కండిషనర్ అప్త్లె చేసుకోవాలి.

జిడ్డు చర్మం కోసం..

చలికాలంలో కేవలం పొడి చర్మం ఉన్నవారికే సమస్యలెదురవుతాయి అనుకుంటే పొరపాటే. జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పొడి చర్మం ఉన్నవారు కాస్త నూనె శాతం ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్ రాసుకొని చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవచ్చు. కానీ జిడ్డు చర్మం ఉన్నవారికి కనీసం ఆ అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఎలాంటి మాయిశ్చరైజర్ రాయకపోతే వారి చర్మం మరింత పొడిగా తయారవుతుంది.. పైగా చర్మకణాలు కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగని మాయిశ్చరైజర్ రాస్తే చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకే ఈ తరహా చర్మతత్వం ఉన్నవారు జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఒకవేళ నూనె ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకోవాలనుకున్నా తక్కువ ఆయిల్ ఉన్నది ఎంచుకోవాలి. దాంతో పాటు హెర్బల్ లిప్ బామ్స్ వాడడం, ఎప్పటికప్పుడు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం తప్పనిసరి.

చూశారుగా.. చలికాలంలో ఏ చర్మతత్వం ఉన్న వారు ఎలాంటి చిట్కాలు పాటించాలో..! మీరూ వీటిని గుర్తుపెట్టుకుని పాటించండి..  చలికాలంలోనూ అందంగా మెరిసిపోండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్