తొలి రాత్రే ఆ రహస్యం తెలిసింది..!

‘కాంతం పిన్నీ.. మన సోనాకి సంబంధం కుదిరింది. అబ్బాయి ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎన్‌ఆర్‌ఐ సంబంధం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నాం.. మొత్తానికి ఖాయమైంది. పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి..’ అంటూ ఆనందం పట్టలేకపోయింది సోనా తల్లి సుగుణ.

Published : 23 Jan 2022 14:52 IST

‘కాంతం పిన్నీ.. మన సోనాకి సంబంధం కుదిరింది. అబ్బాయి ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎన్‌ఆర్‌ఐ సంబంధం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నాం.. మొత్తానికి ఖాయమైంది. పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి..’ అంటూ ఆనందం పట్టలేకపోయింది సోనా తల్లి సుగుణ. ఇలా లక్షలు వరకట్నం పోసి, అరకిలో దాకా బంగారమిచ్చి.. బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా సోనా పెళ్లి చేశారు ఆమె పేరెంట్స్. వారం రోజుల్లోనే విజిటింగ్ వీసా మీద సోనాను ఆస్ట్రేలియా తీసుకెళ్లాడు ఆమె భర్త.

కట్‌ చేస్తే..!

నెల తిరగకముందే సూట్‌కేస్‌తో పుట్టింటికి తిరిగొచ్చేసింది సోనా. ‘అదేంటమ్మా.. చెప్పా పెట్టకుండా వచ్చేశావ్‌.. అబ్బాయేడి?’ అని ఆతృతగా అడిగారు ఆమె తల్లిదండ్రులు. ‘నీ అల్లుడు నన్ను మోసం చేశాడమ్మా.. అతనికి ఇంతకుముందే పెళ్లైంది.. ఇప్పటికే అక్కడో పెళ్లాన్ని పెట్టుకొని డబ్బు కోసం మళ్లీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల రోజులూ నాకు నరకం చూపించాడమ్మా.. ఎలాగోలా తప్పించుకొని ఆ నరకం నుంచి బయటపడ్డా..’ అంటూ తల్లి మీద పడి భోరుమంది సోనా.

ఎన్‌ఆర్‌ఐ సంబంధం అని మురిసిపోయిన తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ఓ కొత్త పెళ్లికూతురు. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తనకు తన భర్త అసలు రంగేంటో తొలిరాత్రే బయటపడిందని చెబుతోంది. తన కూతురు సుఖపడుతుందని భావించి లక్షల కొద్దీ కట్నంగా ముట్టజెప్పిన తన తల్లిదండ్రులకు ఇప్పుడీ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోతున్నానంటోంది. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలంటే ఆకాశానికి నిచ్చెనలు వేయడమే అని భావించే ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతోనే తన కథను అందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చానంటోంది. ఇంతకీ ఎవరామె? ఎన్‌ఆర్‌ఐ సంబంధం ఆమెను ఎందుకింత ఆందోళన, నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసింది? తెలుసుకోవాలంటే ఆమె హృదయరాగం వినాల్సిందే!

నా పేరు పూర్ణిమ. మాది గుంతకల్లు దగ్గర ఓ పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ గృహిణి. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మాకు వ్యవసాయ భూములతో పాటు పాల వ్యాపారం కూడా ఉంది. ఆర్థికంగా మరీ శ్రీమంతులం అని చెప్పలేను కానీ.. ఉన్నంతలోనే ఏ లోటూ లేకుండా మమ్మల్ని పెంచారు నాన్న. చిన్నప్పటి నుంచి చదువు, బట్టలు.. ఇలా ప్రతి విషయంలోనూ మా ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చారు. ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే.. తను మాకు తల్లిగానే కాదు.. ఒక ఫ్రెండ్‌గా అన్ని సలహాలూ ఇస్తుంటుంది. అది బాధైనా, సంతోషమైనా అందరం కలిసే పంచుకునే వాళ్లం. ఇలా నేను, తమ్ముడు, చెల్లి చిన్నతనం నుంచీ స్నేహపూర్వక వాతావరణంలో పెరిగాం..

ఇంటర్‌ వరకు మా ఊర్లోనే చదివినా.. బీటెక్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. మొదట్లో ఇంటిని మిస్సవుతున్నాననిపించేది.. కానీ తర్వాత నెమ్మదిగా ఇక్కడి లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడిపోయా. అందుకు నా ఫ్రెండ్స్‌ కూడా ఓ కారణమే అని చెప్తా. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో వాళ్లు నాతో అంత బాగా కలిసిపోయారు మరి! ఇక పండగలు, ఇతర శుభకార్యాలప్పుడు నా ఫ్రెండ్స్‌ని కూడా నాతో తీసుకెళ్లడం, వారిళ్లలో ఫంక్షన్లైతే నేనూ వెళ్లడం.. ఇలా బీటెక్‌ నాలుగేళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. ఫైనలియర్‌ తుది సెమిస్టర్‌ పరీక్షలకు ముందు ఓసారి ఇంటికి రమ్మని అమ్మానాన్న నాకు కబురు పెట్టారు. అంత అర్జెంట్‌ ఏంటి అని అడిగినా అప్పుడు వాళ్లు నాకు చెప్పలేదు. ఇక వెళ్లాక తెలిసింది.. నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. చూడ్డానికి అబ్బాయి వాళ్లు వస్తున్నారని!

******

‘అబ్బా.. అప్పుడే నాకు పెళ్లేంటమ్మా.. ఇంకా చదువుకోవాలి’ అని వాళ్లతో చెప్పాను. కానీ ‘నీకు వచ్చింది అల్లాటప్పా సంబంధమనుకున్నావా.. ఎన్‌ఆర్‌ఐ సంబంధం.. మన దూరపు బంధువుల అబ్బాయే! పేరు రాహుల్.. అమెరికాలో సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు. నాలుగు చేతులతో సంపాదిస్తున్నాడు.. నువ్వు అతనితో సుఖపడతావమ్మా.. మా మాట విను!’ అంటూ నా పేరెంట్స్‌ నన్ను ఒప్పించారు. ‘అయినా చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది ఇచ్చారు.. నాకేం కావాలో నాకన్నా బాగా మీకే తెలుసు..’ అంటూ సంతోషంగా పెళ్లి చూపులకు రడీ అయిపోయా. మా ఇంట్లో తొలి శుభకార్యం కదా.. పెళ్లి చూపులకు కూడా మా బంధువులందరూ రావడంతో ఇల్లంతా సందడిగా మారింది. అంతలోనే అబ్బాయి వాళ్లొచ్చేసి హాల్‌లో కూర్చున్నారు. నేను నా గదిలో ముస్తాబవుతున్నా.. ఇక పెళ్లి కొడుకును చూసిన నా చెల్లి నా దగ్గరకొచ్చి.. ‘అక్కా.. బావ చాలా అందంగా ఉన్నాడు..’ అంది. అప్పటిదాకా ఏ అబ్బాయి గురించీ ఆలోచన రాని నాకు.. చెల్లి ఆ విషయం చెప్పగానే అతడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృత నాలో మొదలైంది.

******

ఆ క్షణం రానే వచ్చింది.. అమ్మ నన్ను తీసుకెళ్లడానికి నా గదిలోకొచ్చింది.. అబ్బాయికి ఎదురుగా ఉన్న కుర్చీలో నన్ను కూర్చోబెట్టింది. ఓరగా తనవైపు చూశా.. తనూ నన్ను చూశాడు. అమ్మాయి నాకు నచ్చేసింది అని అందరి ముందే చెప్పాడు. అతను నాకూ నచ్చాడు.. కానీ అందరి ముందు సిగ్గుతో చెప్పలేకపోయా. అంతలోనే ‘నేను తనతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నా..’ అన్నాడు. ఓవైపు సిగ్గు, బిడియం, మరోవైపు లోలోపల సంతోషంతోనే తనను నా గదిలోకి తీసుకెళ్లా. నా అభిప్రాయం అడిగాడు.. నచ్చారని చెప్పా. ఆ తర్వాత మా ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడుకున్నాం.. ‘పెళ్లయ్యాక వెంటనే మనం అమెరికా బయల్దేరాలి..’ అన్నాడు. అందుకు సరేనన్నా. వాళ్లు వెళ్లిపోయాక అమ్మానాన్నలకూ నా అభిప్రాయం చెప్పాను. చాలా సంతోషించారు. ఎన్నారై సంబంధం.. ఇక నా కూతురికి ఏ ఢోకా లేదు అని సంబరపడిపోయారు. పరీక్షలయ్యాక పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసేశారు. ఇదే సంతోషంలో తేలియాడుతూ నేనూ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నా.

******

చూస్తుండగానే పరీక్షలు కూడా పూర్తయ్యాయి. నేను-రాహుల్‌ ఫోన్‌లో మాటల్లో పడిపోయి రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ముందు నిశ్చితార్థం జరిగింది. అలాగే హల్దీ, సంగీత్‌, మెహెందీ.. ఇలా పెళ్లికి ముందు అన్ని ఫంక్షన్లూ ఘనంగా జరిగాయి. ఎంగేజ్ మెంట్ లో రాహుల్‌ నా వేలికి డైమండ్‌ రింగ్‌ తొడిగాడు. మా ఇంట్లో ఇది మొదటి శుభకార్యం కాబట్టి చాలామంది బంధువులు వచ్చారు. వారందరి ఆశీర్వాదాలు, అమ్మానాన్నల అంతులేని సంతోషం మధ్య మా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి మండపంలోనే రాహుల్‌ నా చెవిలో.. ‘నీకో సర్‌ప్రైజ్‌.. కానీ ఇప్పుడు కాదు.. మన ఫస్ట్ నైట్‌ రోజు చెప్తా..!’ అంటూ గుసగుసగా చెప్పేసరికి నాకు సిగ్గు మొగ్గలేసింది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా? ఏంటా ఆ సర్‌ప్రైజ్‌? అంటూ నాలో నేను ఊహించుకుంటూ కలల్లో మునిగిపోయా..

నా ఎదురుచూపులకు తోడు.. పది రోజుల దాకా శోభనానికి మంచి ముహూర్తం లేదని చెప్పడంతో ఒక్కసారిగా నీరసపడిపోయా. ఈలోగా మేము అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది. అమ్మానాన్నల్ని వదిలి వెళ్తున్నానన్న బాధ ఓవైపు ఉన్నా.. రాహుల్‌తో కలిసి విదేశాలకు వెళ్తున్నానన్న ఆనందం మరోవైపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇద్దరం కబుర్లలో మునిగిపోయే సరికి విమానం అమెరికాలో ల్యాండ్‌ అయింది. వెళ్లగానే రాహుల్‌ ఫ్రెండ్‌ మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నాడు. ఫ్రెండే కదా.. మమ్మల్ని దిగబెట్టి వెళ్లిపోతాడనుకున్నా.. కానీ అతనూ మా ఇంట్లోనే ఉండిపోయాడు. మరుసటి రోజే మా ఫస్ట్ నైట్‌ ప్లాన్‌ చేసుకున్నాం. అయితే మేమిద్దరం ఉంటే పర్లేదు.. కానీ పానకంలో పుడకలా రాహుల్‌ ఫ్రెండ్‌ ఎంతకీ వెళ్లడే! అప్పుడే నాకేదో అనుమానంగా, మరోవైపు భయంగా అనిపించింది! అయినా రాహుల్‌ ఉండగా భయమెందుకు అని నా మనసుకు నేనే సర్దిచెప్పుకున్నా. అప్పటికే ఆ మూడో వ్యక్తి నన్ను అదోలా చూడడం కూడా గమనించాను.. కానీ తేలిగ్గా తీసుకున్నా..! ఇక ఆ రాత్రి పాల గ్లాస్‌తో గదిలోకి వెళ్లాను. రాహుల్‌ని చూడగానే చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చేసింది.. ఏదో ఓ మూల భయంగానూ అనిపించింది..! అయితే ఆ రాత్రే నేను కన్న కలలన్నీ కల్లలవుతాయని, ఓ భయంకరమైన నిజం నా జీవితాన్ని తలకిందులు చేస్తుందని నేను ఊహించలేదు.

******

గదిలోకి వెళ్లి రాహుల్‌కి పాల గ్లాసు అందించి.. అతని పక్కనే కూర్చున్నా..! దాంతో అతను వెంటనే లేచి దూరం జరిగాడు. తనకీ సిగ్గేమో అంటూ ముసిముసిగా నాలో నేనే నవ్వుకున్నా. ‘ఏదో సర్‌ప్రైజ్‌ అన్నారు!’ అంటూ ఉండబట్టలేక అడిగేశా. ‘బాగా ఆతృతగా ఉన్నట్లున్నావ్‌’ అన్నాడు.. అవునంటూ నవ్వేశా! ‘ఇంతదాకా వచ్చాక నువ్వంటే నాకు ఇష్టం లేదు..’ అని చెప్తే నువ్వేం చేస్తావ్‌ అన్నాడు.. ‘కలలోనైనా ఆ మాట అనకండి.. నేను మొదటగా చూసింది, ఇష్టపడిందీ మిమ్మల్నే.. మీరు మాటవరసకైనా అలా అంటే నేను తట్టుకోలేను..’ అన్నాను. ‘నువ్వు తట్టుకున్నా, తట్టుకోకపోయినా అదే నిజం!’ అంటూ నా గుండెలు బద్దలయ్యే మాట చెప్పాడు.

‘నిజానికి నాకు ఆడవాళ్లంటే అసహ్యం.. మగాళ్లంటే ఇష్టం. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాడే.. అతనే నా బాయ్‌ఫ్రెండ్‌.. అతని కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా.. పైగా లక్షలకు లక్షలు కట్నం వస్తుందంటే ఎవరు కాదంటారు.. నేను నీతో సంసారం చేయలేను.. నాకు నా బాయ్ ఫ్రెండ్ కావాలి...నీ డబ్బు కావాలి... అలాగే నా ఫ్రెండ్ కి నువ్వు కావాలి... నువ్వు అతన్ని సంతోషపెట్టాలి..’ అన్నాడు. ఆ మాటలు విని కలగంటున్నానా అంటూ నన్ను నేనే గిల్లుకొని చూశా.. అది కల కాదు.. పచ్చి నిజమని నాకు అర్థమైంది. ఆ మాటలు విన్న నా మనసు ఒక్కసారిగా ముక్కలైంది. నేను కన్న కలల సౌధం కూలిపోయింది. ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెట్టిన నేను.. నేరుగా నరకంలోకే వచ్చి పడతానని ఊహించలేదు.

రాహుల్‌కి ఇంట్లో ఉన్న అతనే కాదు.. బయట కూడా చాలామంది అబ్బాయిలతో సంబంధాలున్నాయని తర్వాత నాకు తెలిసింది. ఈ విషయం అంతకుముందే రాహుల్‌ వాళ్ల అమ్మానాన్నలకు తెలిసినా డబ్బు కోసం నా గొంతు కోశారు. అయితే నా సమస్య గురించి అమ్మానాన్నలతో ఎలా చెప్పాలా అని అని ఆలోచిస్తున్నా! విదేశీ సంబంధం.. బోలెడంత జీతం.. నా కూతురు సుఖపడుతుందని అమ్మానాన్న ఎంతో సంతోషంతో ఉన్నారు. నా పెళ్లి కోసం మాకున్న వ్యవసాయ భూములు కొన్ని అమ్మి, బంగారంతో సహా కోటి రూపాయల దాకా ముట్టజెప్పారు. పైగా వచ్చే ఏడాది నా చెల్లి పెళ్లి చేయడానికి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నేను ఈ భయంకరమైన నిజం వారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా.. అలాగని మగాడు కాని ఈ మొగుడితో కాపురమూ చేయలేను!

నేనొక్కదాన్నే కాదు.. నాలాగే ఎన్నారై సంబంధాలు చేసుకొని మోసపోయిన అమ్మాయిలు బోలెడంతమంది ఉండే ఉంటారు. ఎన్నారై సంబంధాలనగానే ఆకాశానికి నిచ్చెన వేసినంతగా ఆనందపడిపోతారు చాలామంది. పాపం అటు పేరెంట్స్ ఏమో తమ కూతురి సుఖం కోసం ఆలోచిస్తారు.. అందుకు అమ్మాయిలూ సరేనంటారు. తీరా పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లేదాకా తెలియదు వాళ్ల అసలు రంగేంటో! ఒకరేమో అదనపు కట్నం కోసం చేసుకున్నామంటారు.. మరొకరు తీరా అక్కడికెళ్లాక వేధింపులకు పాల్పడతారు.. ఇంకొకరికి అప్పటికే పెళ్లైనా డబ్బు మత్తులో మరో అమ్మాయి గొంతు కోస్తారు.. ఇలా ఒక్కో ఎన్నారై సంబంధానికి ఒక్కో లొసుగు ఉంటుంది. అలాగని అన్ని సంబంధాలూ ఇలాగే ఉంటాయని చెప్పలేం.

******

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఇక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడడమే నా లక్ష్యం.. అలాగే నన్ను నమ్మించి మోసం చేసిన నా భర్త, అత్తమామల్ని ఎలాగైనా సరే వదలకూడదనుకుంటున్నా.. నేను ఇక్కడ నుంచి తప్పించుకుని వచ్చి, వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మీరు కూడా సలహా ఇస్తారా?

ఇట్లు,

పూర్ణిమ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్