viral news: నోరుజారిన అమెరికా అధ్యక్షుడు.. రిపోర్టర్‌ను తిట్టిన బైడెన్‌..!

ఎప్పుడూ హుందాగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ఓ విలేకరిపై నోరుపారేసుకొన్నారు. ఈ తతంగం జరిగే సమయంలో ఆయన మైక్‌

Published : 26 Jan 2022 02:02 IST

 కెమెరాల్లో రికార్డు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పుడూ హుందాగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల ఓ విలేకరిపై నోరుపారేసుకొన్నారు. ఈ తతంగం జరిగే సమయంలో ఆయన మైక్‌ ఆన్‌లో ఉండటంతో అది అక్కడున్న వారందరికీ వినిపించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన జనవరి 24వ తేదీన శ్వేతసౌధంలో చోటు చేసుకొంది. వైట్‌హౌస్‌ ఈస్ట్‌రూమ్‌లో కాంపిటీషన్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధరల తగ్గింపుపై చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. దీంతో ఆ ప్రదేశమంతా కోలాహలంగా మారింది. ఈ సమయంలో ఫాక్స్‌ న్యూస్‌కు చెందిన శ్వేతసౌధం కరస్పాండెంట్‌ పీటర్‌ డూసీ బైడెన్‌ను ఓ ప్రశ్న అడిగారు.  ‘‘మీరు ద్రవ్యోల్బణంపై ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధమేనా..? మిడ్‌టర్మ్‌ ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణాన్ని రాజకీయ భారంగా భావిస్తున్నారా..?’’ అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్న విన్న బైడెన్‌ కోపాన్ని అదుపులో పెట్టుకొంటూ వెటకారంగా స్పందించారు. ‘‘మరింత ద్రవ్యోల్బణం ఉండటం గొప్ప ఆస్తి’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మైక్‌ కట్‌ అయిపోయిందని భావించిన బైడెన్‌ ఆ విలేకరిని ‘వాట్‌ ఏ స్టూపిడ్‌‌....’’ అంటూ రాయలేని భాషలో తిట్టారు. కానీ, మైక్‌ ఆన్‌లో ఉండటంతో అక్కడున్న వారికి వినిపించింది. 

ఈ విషయాన్ని పీటర్‌ డూసీ కూడా గమనించలేదు. ఆ తర్వాత  ఫాక్స్‌ న్యూస్‌ షోలో తన ప్రతిస్పందన తెలియజేశారు. డూసీ మాట్లాడుతూ ‘‘అది కాంపిటేషన్‌ కౌన్సిల్‌ భేటీలో ఓ విలేకరి రష్యాపై ప్రశ్న అడిగారు. దానికి జవాబు ఇచ్చేందుకు ఇష్టపడని బైడెన్‌.. ‘సంబంధలేని ప్రశ్నలు అడగవద్దు’ అని తోసిపుచ్చారు. అప్పటికే నేను చాలా ప్రశ్నలు సిద్ధం చేసుకొన్నాను. కానీ, వాటిని వదిలేసి ద్రవ్యోల్బణంపై ఆ ప్రశ్న అడిగాను. ఆ కోలాహలంలో బైడెన్‌ ఏం సమాధానం చెప్పారో కూడా వినిపించలేదు. ఆ తర్వాత బ్రీఫింగ్‌ రూమ్‌లో కొందరు వచ్చి బైడెన్‌ అన్న మాటలు చెప్పారు’’ అని పేర్కొన్నాడు. 

ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫాక్స్‌ న్యూస్‌ కరస్పాండెంట్‌ డూసీకి ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని డూసీనే స్వయంగా వెల్లడించాడు. ‘‘ఈ ఘటన జరిగిన గంటన్నర లోపే ఆయన నా సెల్‌కు కాల్‌ చేశారు. అది వ్యక్తిగతంగా అన్నది కాదు మిత్రమా’’ అని పేర్కొన్నారు. అయన మా మధ్య ఉన్న గందరగోళాన్ని ముగించారని డూసీ అభిప్రాయపడ్డారు. తమ మధ్య మంచి ఆరోగ్యకరమైన సంభాషణ జరిగిందని వివరించారు. తాను చాలా ప్రశ్నలు అడగాలనుకున్న విషయాన్ని బైడెన్‌కు వివరించానని చెప్పాడు. దీనికి అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారని డూసీ వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు