US China: వింటర్‌ ఒలింపిక్స్‌లో జోక్యం కాదు.. ముందు ఆ వివాదాన్ని తీవ్రంగా పరిగణించండి

బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. బదులుగా.. యూరప్‌లో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా...

Published : 27 Jan 2022 15:32 IST

అమెరికాకు చైనా హెచ్చరిక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. బదులుగా.. యూరప్‌లో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా, అమెరికా విదేశాంగ మంత్రులు వాంగ్‌ యీ, ఆంటోని బ్లింకెన్‌ల తాజా టెలిఫోన్‌ సంభాషణపై.. డ్రాగన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్‌లో ఫిబ్రవరి 4 నుంచి వింటర్‌ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరోనా కలవరం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ.. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని చైనా పట్టుదలతో ఉంది. అయితే.. ఆ దేశంలోని షింజియాంగ్‌ ప్రావిన్స్‌ తదితర చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ.. అమెరికా ఈ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలోనే వాంగ్‌ యీ మాట్లాడుతూ.. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో అమెరికా తన జోక్యాన్ని మానుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు. తైవాన్ సమస్యపై నిప్పుతో చెలగాటమాడటాన్ని ఆపేయాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ విషయంలో యూరప్‌లో పెరుగుతోన్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. అమెరికా ప్రస్తుతం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని కోరారు. అన్ని పక్షాలు ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వదిలిపెట్టి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యూరప్‌లో నాటో కూటమి విస్తరణపై రష్యా ఆందోళనలకు పరోక్షంగా మద్దతు పలుకుతూనే.. సైనిక కూటముల బలోపేతం, విస్తరణతో ప్రాంతీయ భద్రత సాధ్యంకాదని తెలిపారు. ఈ చర్చలపై అమెరికా కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో ప్రపంచ భద్రతకు వాటిల్లే ముప్పు, ఆర్థిక నష్టాలను బ్లింకెన్‌ నొక్కిచెప్పినట్లు అందులో పేర్కొంది. అయితే, అందులో వింటర్‌ ఒలింపిక్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని