
‘ఆ రోజు అణుబాంబు పేలినట్లు అనిపించింది’.. టోంగా ద్వీపవాసుల ప్రత్యక్ష అనుభవం
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన ఘటనలో సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైన విషయం తెలిసిందే. సునామీ అలల ధాటికి టోంగా రాజధాని నుకుఅలోఫా ధ్వంసమైంది. ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సమాచార సేవలూ దెబ్బతిన్నాయి. అణుబాంబు పేలిందా? అన్నంత తీవ్రస్థాయిలో ఈ విస్ఫోటం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్థానిక రెడ్‌క్రాస్ జనరల్ సెక్రెటరీ సీయోన్ తాజాగా తన భయంకర అనుభవాన్ని చెప్పుకొచ్చారు. శబ్దాల తీవ్రతకు మొత్తం ద్వీపం వణికినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తేలగా, నష్టాన్ని లెక్కించాల్సి ఉంది.
అగ్నిపర్వతం పేలి దాదాపు వారం రోజులు కావొస్తున్నా.. స్థానికంగా తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా పెద్దఎత్తున బూడిద మేట వేయడంతో.. సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్థానికులు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. తాగునీటి కోసం ప్రధానంగా వర్షపు నీళ్లపై ఆధారపడే ఈ దేశంలో.. ప్రస్తుతం నీటి వనరులు బూడిద, ఉప్పునీళ్లతో కలుషితం అయ్యాయి. దీంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఐరాస సమన్వయకర్త జోనాథన్ వీచ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా భూగర్భ జలాల కోసం నీటి పరీక్షలు చేపడుతున్నారు.
ప్రస్తుతం టోంగా విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వేపై బూడిదను తొలగించారు. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి సహాయ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. నిత్యవసరాలు, నీళ్లు వంటివి సరఫరా చేస్తున్నాయి. అయితే, ఇతర దేశాల నుంచి సహాయ చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో.. టోంగాలో ఒమిక్రాన్ వ్యాప్తి అవకాశాలపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు అగ్నిపర్వత పేలుడు ధాటికి సముద్ర గర్భంలోని సమాచార కేబుల్ వ్యవస్థ ధ్వంసం కావడంతో.. టోంగాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పరిస్థితుల పునరుద్ధరణకు వారాలు పట్టే అవకాశం ఉంది.
ఈ సమస్యపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. తన ‘స్టార్‌లింక్’ ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చారు. టోంగాలో ఇంటర్నెట్ కోసం స్టార్‌లింక్ సేవల అవసరం ఉందో లేదో తెలియజేయాలంటూ స్థానికులను కోరారు. ఓ వార్తాసంస్థ కథనానికి సమాధానంగా.. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. భూకక్ష్యలోకి వందలాది ఉపగ్రహాలను ప్రయోగించి.. వాటి సాయంతో ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్‌లింక్ ప్రాజెక్ట్’ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.