Selfie: సెల్ఫీలతో కోటీశ్వరుడయ్యాడు..

రోజూ సెల్ఫీ తీసుకోవడం ఆ విద్యార్థి అలవాటు. ఆ సెల్ఫీలే ఇప్పుడు అతడి జీవితాన్ని మార్చేశాయి. అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు రూ.కోట్లు తెచ్చిపెట్టాయి.సుల్తాన్‌ గుస్తాఫ్‌ అల్‌ ఘొజాలి(22).. ఇండోనేసియాలోని సెమరాంగ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి.

Published : 24 Jan 2022 07:29 IST

జకార్తా: రోజూ సెల్ఫీ తీసుకోవడం ఆ విద్యార్థి అలవాటు. ఆ సెల్ఫీలే ఇప్పుడు అతడి జీవితాన్ని మార్చేశాయి. అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు రూ.కోట్లు తెచ్చిపెట్టాయి.సుల్తాన్‌ గుస్తాఫ్‌ అల్‌ ఘొజాలి(22).. ఇండోనేసియాలోని సెమరాంగ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి. కంప్యూటర్‌ ముందు కూర్చుని, రోజూ ఒకటే సెల్ఫీ తీసుకుంటాడు. అలా ఐదేళ్లుగా చేస్తున్నాడు. గ్రాడ్యుయేషన్‌ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా ఆ సెల్ఫీలు అన్నింటితో కలిపి ఓ టైమ్‌లాప్స్‌ వీడియో చేద్దామనుకున్నాడు. ఇంతలోనే ‘నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌’(ఎన్‌ఎఫ్‌టీ)లకు సంబంధించిన వార్తలు అతడి దృష్టిని ఆకర్షించాయి. వెంటనే సంబంధిత వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచాడు. జనవరి 10న ‘ఘొజాలి ఎవిరీడే’ పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. ఒక్కోదాని ధర 3 డాలర్లేనని పోస్ట్‌ చేశాడు.

ఒక్కరి పోస్ట్‌ వల్ల..

ఘొజాలి సెల్ఫీని ఎన్‌ఎఫ్‌టీగా కొన్నట్లు ఓ సెలబ్రిటీ షెఫ్‌ ట్వీట్‌ చేశారు. అంతే.. అతడి స్వీయ చిత్రాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. జనవరి 21కల్లా.. 500 మందికిపైగా ఈ సెల్ఫీలు కొనుగోలు చేశారు. ఫలితంగా అతడి ఖాతాలో 384 ఎథెర్‌ కాయిన్స్‌ వచ్చి చేరాయి. ఎథెర్‌ అంటే.. బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టోకరెన్సీ. 384 ఎథెర్‌ల విలువ.. 10 లక్షల డాలర్లకుపైనే. అంటే దాదాపు రూ.7.5 కోట్ల రూపాయలు. ట్వీట్లు, పాటలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్‌ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీనే ఎన్‌ఎఫ్‌టీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని