KFC: కేఎఫ్‌సీపై మండిపడుతున్న చైనా!

ఫుడ్‌ సప్లయి రంగంలో కేఎఫ్‌సీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎఫ్‌సీ చికెన్‌ను ఆహారప్రియులు చాలా ఇష్టంగా తింటుంటారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు అనేక అవుట్‌లెట్లు ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం చైనాలో కేఎఫ్‌సీకి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా

Published : 18 Jan 2022 01:51 IST

బీజింగ్‌: ఫుడ్‌ సప్లయ్‌ రంగంలో కేఎఫ్‌సీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎఫ్‌సీ చికెన్‌ను ఆహారప్రియులు చాలా ఇష్టంగా తింటుంటారు.. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు వేల సంఖ్యలో అవుట్‌లెట్లు ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం చైనాలో కేఎఫ్‌సీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన ఆఫరే ఇందుకు కారణం.

పాప్‌ మార్ట్‌ అనే బొమ్మలు తయారీ సంస్థతో కలిసి కేఎఫ్‌సీ ఓ ఆఫర్‌ ప్రకటించింది. కేఎఫ్‌సీలో మీల్‌ ఆర్డర్‌ చేస్తే ఆర్డర్‌తోపాటు పాప్‌ మార్ట్‌కు చెందిన మిస్టరీ బాక్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ మిస్టరీ బాక్స్‌లో పరిమితంగా తయారు చేసిన కొన్ని బొమ్మలు ఉంటాయి. చైనాలో కేఎఫ్‌సీని ప్రారంభించి 35ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇదే ఇప్పుడు చైనా వినియోగదారుల సంఘం (సీసీఏ)కి ఆగ్రహం తెప్పించింది. ఈ ఆఫర్‌ ఆహారం వృథాని ప్రోత్సహించే విధంగా ఉందని మండిపడుతోంది.

చైనాలో ఇప్పటికే ఆహారం వృథాపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. అందుకే, 2020లో ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‘క్లీన్‌ ప్లేట్‌’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా ఆహారం మితంగా తినాలని, వృథా చేయకూడదని సూచించారు. అయితే, కేఎఫ్‌సీ ఆఫర్‌తో వచ్చే బొమ్మల కోసం ప్రజలు ఆకలి లేకపోయినా ‘మీల్‌’ను ఆర్డర్‌ చేసి.. బొమ్మని తీసుకొని ఆహారం పడేసే ప్రమాదం ఉందని సీసీఏ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ వ్యక్తి కేవలం బొమ్మలను సేకరించడానికి 100 సార్లు కేఎఫ్‌సీ ‘మీల్‌’ ఆర్డర్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో ఆహారం వృథా భారీగా జరగొచ్చని, వెంటనే కేఎఫ్‌సీని నిషేధించాలని సీఏఏ కోరుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని