Sri Lanka: శ్రీలంకలో ఇంధన కొరత.. స్కూళ్లు మూత, ఆఫీసులు బంద్‌

శ్రీలంకలో ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా అక్కడి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Published : 21 May 2022 02:04 IST

ఆహార, ఇంధన సంక్షోభాలతో అల్లాడుతోన్న లంకేయులు

కొలంబో: తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్‌ డబ్బాలతో బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి కొనసాగుతోంది. ఇలా ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో చర్యలు చేపట్టిన శ్రీలంక అధికారులు తాజాగా అక్కడి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని సూచించారు.

‘దేశంలో ఇంధన కొరత, రవాణా సౌకర్యాల్లో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా అత్యవసర సేవలు మినహా అధికారులెవ్వరూ కార్యాలయాలకు రావద్దు’ అని ప్రభుత్వ పాలనా విభాగం వెల్లడించింది. దీనితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కూడా శుక్రవారం మూసివేయాలని ఆదేశించింది. అయితే, ఇవి ఎప్పటివరకు కొనసాగుతాయనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

మరోవైపు దేశంలో ఒకరోజు మాత్రమే సరిపడా పెట్రోల్‌ నిల్వలు ఉన్నాయంటూ ఇటీవల నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్‌ విక్రమసింఘే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, పెట్రోల్‌తోపాటు ఇతర ఇంధనాల కొరత కూడా శ్రీలంకను తీవ్రంగా వేధిస్తోంది. వీటికోసం ప్రజలు బంకుల వద్ద రోజుల తరబడి వేచి ఉండడంతో పాటు పలు చోట్ల ఘర్షణలకు కారణమవుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇంధన దిగుమతికి డాలర్లు లేకపోవడంతో అంతర్జాతీయ సంస్థలు, విదేశాల సహాయం కోసం ఎదురుచూస్తోంది.

ఇదిలాఉంటే, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ కూడా ముగిసిపోవడంతో అధికారికంగా ఎగ్గొట్టినట్లైంది. ఈ విషయాన్ని రెండు క్రెడిట్‌ ఏజెన్సీలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం తమ దేశం ముందస్తు దివాలాలో ఉందని శ్రీలంక రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని