
UAE: అబుదాబి దాడులతో అప్రమత్తం.. డ్రోన్‌లపై యూఏఈ నిషేధం
అబుధాబి: ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో యెమన్ హుతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన యూఏఈ ప్రభుత్వం.. స్థానికంగా నెల రోజులపాటు డ్రోన్‌లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతర్గత వ్యవహారాలశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇటీవల జరిగిన దాడుల గురించి నేరుగా ప్రస్తావించకుండా.. నిషేధిత ప్రాంతాల్లోనూ డ్రోన్‌లను ఎగురవేస్తూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశామని శాఖ తెలిపింది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అత్యవసర పనుల కోసం డ్రోన్‌లను వినియోగించాల్సి వస్తే.. తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు అబుదాబి దాడుల తర్వాత యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హుతీ తిరుబాటుదారుల అధీనంలోని యెమన్ రాజధాని సనాపై జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్‌లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి. అనంతరం యెమన్లోని సాదా జైలుపై జరిపిన వైమానిక దాడిలో 70 మందికి పైగా మరణించారు.