యూఏఈపై మరో దాడికి యత్నం.. క్షిపణులను ధ్వంసం చేసినభద్రతా బలగాలు

ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుధాబిపై డ్రోన్‌, క్షిపణి దాడులు చేపట్టిన యెమన్‌ హుతీ తిరుగుబాటుదారులు.. సోమవారం మరోసారి దాడులకు యత్నించారు. ఈ క్రమంలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించగా.. వాటిని మధ్యలోనే ధ్వంసం...

Published : 25 Jan 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుధాబిపై డ్రోన్‌, క్షిపణి దాడులు చేపట్టిన యెమన్‌ హౌతీ తిరుగుబాటుదారులు.. సోమవారం మరోసారి దాడులకు యత్నించారు. ఈ క్రమంలో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించగా.. వాటిని మధ్యలోనే ధ్వంసం చేసినట్లు యూఏఈ రక్షణశాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ధ్వంసమైన క్షిపణుల శకలాలు అబుధాబి చుట్టుపక్కల పడిపోయినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇది జరిగిన వెంటనే వైమానిక దాడి జరిపి.. ఆ క్షిపణులను ప్రయోగించిన యెమెన్‌లోని లాంచ్‌ప్యాడ్‌నూ ధ్వంసం చేసినట్లు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

అంతకుముందు సౌదీ అరేబియా సైతం.. ఆదివారం రాత్రి తమ దేశంలోని దక్షిణ భాగంలో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఓ బాలిస్టిక్ క్షిపణి పడిపోయిందని, ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలయ్యాయని ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గత సోమవారం అబుధాబిలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్‌, క్షిపణి దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. సరిగ్గా వారం రోజుల తర్వాత సోమవారం యూఏఈ భూభాగంపై రెండోసారి దాడికి యత్నించడం గమనార్హం. అయితే, ఈ దాడులను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు యూఏఈ తెలిపింది. ఈ క్రమంలోనే సౌదీ సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుబాటుదారుల అధీనంలోని యెమెన్‌పై దాడులు ముమ్మరం చేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని