సమస్యల.. షేరింగ్‌లో పడొద్దు!
close
Published : 27/05/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమస్యల.. షేరింగ్‌లో పడొద్దు!

ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న ఘటనలు ఇలాంటివెన్నో...  సరదా కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్న వీడియోలే పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి... ఊసుపోక చేసిన చాటింగ్‌లు అమ్మాయిల పాలిట శాపాలవుతున్నాయి... ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ల్లో ఆడా, మగా ఇద్దరూ చురుగ్గా ఉన్నా అతిగా బలవుతోంది అతివలే... వీటిని కట్టడి చేయడమెలా? ఈ వ్యసనంలో నుంచి బయటపడేదెలా?


రోజంతా టిక్‌టాక్‌కే అతుక్కుపోతున్నావని భర్త మందలింపు. భార్య ఆత్మహత్య...
- విజయవాడలో ఘటన


వీడియో షేరింగ్‌ ద్వారా పరిచయమైన అబ్బాయిని కలవడానికి వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం...
- కొద్దిరోజుల కిందట జరిగిన ఘోరం


టెక్నాలజీ, సామాజిక మాధ్యమాలు.. రెండువైపులా పదునున్న కత్తిలాంటివి. మనం ఉపయోగించే తీరుకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయంటారు నిపుణులు. ఈ మధ్యకాలంలో వీడియో షేరింగ్‌ యాప్‌లు ఎక్కువగా కాపురాల్లో కలతలకు కారణమవుతున్నాయి. మహిళలు వీటిపట్ల జాగ్రత్త వహించాల్సిందే.

ఎందుకీ మత్తు?

స్త్రీ, పురుషులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కోరుకుంటారు. ఆర్థిక ప్రయోజనం ఆశిస్తారు. ఈ రెండింటినీ ఆశగా చూపి జనాలను బాగా ఆకట్టుకునేవేే టిక్‌టాక్‌, లైక్‌, హలో, షేర్‌చాట్‌, స్నాప్‌చాట్‌లాంటి వీడియో షేరింగ్‌ యాప్‌లు. ఇన్‌స్టాల్‌ చేసుకుంటే నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, రోజూ యాప్‌ తెరిస్తే క్రెడిట్‌ పాయింట్లు కేటాయించడం, వీడియోలకు ఎక్కువ వీక్షణలు ఉంటే డబ్బులివ్వడంతో జనం వీటివైపు ఆకర్షితులవుతున్నారు. పేరు, డబ్బు, వీటితోపాటు కావాల్సినంత వినోదం. ఇవి వేదికగా ఎందరో తమ సృజనాత్మకతతో అద్భుతాలు చేస్తున్నారు. కొందరు మాత్రం కాస్త పాపులారిటీ రాగానే ఇదే జీవితమనే భావనకు లోనవుతారు. ఒకలాంటి మత్తులో మునిగిపోతారు. దీనివల్ల కలగబోయే దుష్ఫరిణామాలు సైతం అంచనా వేయలేని స్థితికి చేరుకుంటారు.

మెల్లిగా ఊబిలోకి

ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మొదట్లో నాలుగైదు వీడియోలు రూపొందించి అప్‌లోడ్‌ చేయడం తేలికే. తర్వాత ఇంకేం చేయాలో తెలియదు. ఆ వీడియోలు మామూలుగా ఉంటే లైక్‌లు ఆగిపోతాయి. మరోవైపు ఇతరులకు ఫాలోవర్లు పెరుగుతున్నా, అధిక లైక్‌లు వస్తున్నా ఒత్తిడికి గురవుతారు. వాళ్లను దాటిపోవాలని, జనాన్ని మెప్పించాలనే ఆరాటంతో... వయసుకు సంబంధం లేని డాన్సులు చేయడం, రొమాంటిక్‌ వీడియోలు పెట్టడం, కొత్తకొత్త సాహసాలు చేయడం వంటివి పోస్ట్‌ చేస్తారు. స్వీయ నియంత్రణ కోల్పోతారు. ఇలాంటి బలహీనత ఉన్న అమ్మాయిలు, గృహిణుల కోసమే కొందరు కాచుకొని ఉంటారు. ‘నువ్వు అందంగా ఉన్నావని, నీ టాలెంట్‌ అద్భుతం’ అని పదే పదే పొగుడుతారు. ప్రతి వీడియోకి లైక్‌ కొడతారు. ఆ మాటల మాయలో పడిపోతారు వీళ్లు. భాగస్వామి కన్నా వారే ఎక్కువ అనే భావనకు లోనవుతారు. చివరికి ఆ వ్యక్తిని కలుసుకోవడం, వారిపై ప్రేమలు పెంచుకోవడం వరకు వెళ్తుంది. ఈ విషయం బయటపడ్డ రోజు ఇంట్లో కలతలు చెలరేగుతాయి. వివాదాలు మొదలవుతాయి. అందరిదీ ఇదే పరిస్థితి అని చెప్పలేం. తమను తాము నియంత్రించుకునేవారు వీటిని నిచ్చెన మెట్లలా ఉపయోగించుకొని, తమ ప్రతిభను చూపిస్తూ స్టార్‌లుగా ఎదుగుతారు.


ఒక్క నిమిషం

* మీలో దాగున్న ప్రతిభను ప్రదర్శించాలనుకోవడం, గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు. అవి నలుగురికి ఉపయోగపడే విషయాలైతే షేర్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత విషయాలు, రొమాంటిక్‌ వీడియోలు.. అపరిచితులతో చాటింగ్‌లు అసలే వద్దు.
* డబ్బు, గుర్తింపే ముఖ్యం అనుకుంటే సొంతంగా బ్లాగు ప్రారంభించండి. వీడియోలు షేరింగ్‌ల కోసం భద్రత, నిబంధనలు పాటించే మాధ్యమాన్ని ఎంచుకోండి.
* కుటుంబమే శాశ్వతం.. సామాజిక మాధ్యమాలు కాదని తెలుసుకోవాలి. రోజులో కొంత సమయం మాత్రమే వెచ్చించేలా ‘స్క్రీన్‌ టైం’ని సెట్‌ చేసుకుంటే మంచిది.
* భార్యభర్తల్లో ఒకరి గుర్తింపులో మరొకరు భాగమవ్వాలి. నా విజయంలో నీదీ కీలకపాత్రే అని చెప్పగలగాలి. అది జరిగితే ఇద్దరి మధ్య పొరపొచ్చాలకు ఆస్కారం తక్కువ.


వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఒక్కసారి ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తే మనల్ని మనం ప్రపంచం ముందు పెట్టుకున్నట్టే. మనం షేర్‌ చేసిన పోస్ట్‌ లక్షలమంది చేతులు మారుతుంది. దాన్ని మార్ఫింగ్‌ చేసి చెడుగా వాడొచ్చు. పొరపాటు తెలుసుకొని డిలీట్‌ చేయాలనుకున్నా అప్పటికే అది వేలమంది సొంతమవుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని