ఆ రోజుల్లో ఆత్మీయ నేస్తంలా...
close
Published : 28/05/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజుల్లో ఆత్మీయ నేస్తంలా...

నెలసరి పరిశుభ్రత దినం

‘చూసేదాన్ని చూడొద్దంటరు. నవ్వే చోట నవ్వొద్దంటరు’ నెలసరి మొదలైనప్పటి నుంచి ఆడపిల్లపై ఆంక్షలివి! కానీ ఆ రుతుక్రమాన్ని సక్రమంగా ఎలా నెట్టుకురావాలో అవగాహన లేదెవ్వరికి! కడుపులో నొప్ఫి... భరించాలి. రక్తస్రావం.. కనిపించకుండా జాగ్రత్తపడాలి భయం.. బయటపడకుండా చూసుకోవాలి. ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని నెలకోసారి బాధపడాలి. ఆధునిక యుగంలోనూ అదే పోకడలు. అమ్మదనానికి తెరతీసిన అందమైన ముచ్చటను పీడకలగా అనుభవించకండి. తగిన జాగ్రత్తలతో నెలసరి సరిగా సాగేలా చూసుకోండి..

పక్కన అర్థంపర్థం లేని అపోహలు, ఆంక్షలు, అవమానాలు.. మరో పక్క అందుబాటులో లేని పరిశుభ్రతా కారకాలు. అమ్మాయిలకు నెలసరిని ఓ సవాల్‌గా మార్చేశాయి. మనదేశంలో 20శాతం కంటే తక్కువమంది మహిళలు మాత్రమే నెలసరి సమయంలో శానిటరీ న్యాప్కిన్లని ఉపయోగిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా గోనెసంచులు, ఎండిన ఆకులూ, ప్లాస్టిక్‌ కవర్లు, న్యూస్‌పేపర్లూ వంటివి వాడి అనారోగ్యాల పాలవుతున్నారు. అలాగని చదువుకున్న అమ్మాయిలందరికీ నెలసరి గురించిన పూర్తి అవగాహన ఉందా అంటే లేదనే అంటున్నాయి అధ్యయనాలు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు, సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు దాడిచేస్తున్నాయి.


అక్కడ ప్యాడ్‌లు ఉచితం..!

నెలసరి సమయాన్ని స్త్రీలకు భారంగా మారకుండా చేసింది స్కాట్లాండ్‌ ప్రభుత్వం. పేదరికం వల్ల నెలసరి సమయంలో ప్యాడ్‌లను వాడలేకపోతున్న వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి శానిటరీ న్యాప్‌కిన్లు, టాంపూన్లను ఉచితంగా అందజేస్తోంది.


ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి...

నెలసరి శుభ్రత విషయంలో రాజీ పడితే దీర్ఘకాలంలో అలెర్జీలు మొదలుకుని క్యాన్సర్‌ వరకూ ఎన్నో రకాల అనారోగ్య ముప్పుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. రసాయనాల పూతతో ఉన్న వాటిని ఉపయోగించినా, అపరిశుభ్రంగా ఉన్న వస్త్రాలను వాడినా ఇన్‌ఫెక్షన్లు, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

* కొంతమంది మహిళలు తిరిగి వాడుకునే ప్యాడ్‌లు, టాంపూన్లను వాడుతుంటారు. అయితే వాటిని వాడిన ప్రతిసారి బాగా శుభ్రం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అందులో ఉండే హానికారక సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. లేదంటే ఇన్ఫెక్షన్లు గర్భాశయానికి సోకే ప్రమాదం ఉంది.

* అపరిశుభ్రంగా ఉన్న న్యాప్కిన్లు, వస్త్రాలను వాడటం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ.


ఆరోగ్యాన్నిచ్చే ఆహారం..

నెలసరి సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. పెరుగు, ఒమెగా-3 అధికంగా ఉండే డ్రైనట్స్‌, తాజా కూరగాయలు, తాజా పండ్లు... వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి నెలసరితో వచ్చే చికాకులు ఉండవు.


ఇవి పాటించండి...

* శానిటరీ న్యాప్కిన్లను రెండు మూడు గంటలకోసారైనా మారుస్తూ ఉండాలి. ఆరేడు గంటలు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వాడొద్ధు తరువాత చేతులను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

* పీరియడ్స్‌ సమయంలో గోరువెచ్చటి నీరు, గాఢత తక్కువగా ఉండే సబ్బుని వాడాలి. శానిటరీ న్యాప్కిన్ల వాడకం వల్ల ఆ ప్రదేశంలో కొందరికి అలెర్జీలు, దురదా వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్ధు.

* వ్యక్తిగత భాగాల దగ్గర తడిలేకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన, శుభ్రమైన లోదుస్తులను మాత్రమే వాడాలి. బిగుతుగా ఉండేవి అస్సలు వాడొద్ధు.


జీరోవేస్ట్‌ దిశగా..

* బయోడిగ్రేడబుల్‌ రకాల్ని ఎంచుకోవాలి. వీటిలో ప్రస్తుతం ప్యాడ్లు, టాంపూన్లు, పీరియడ్‌ ప్యాంటీలు వంటివి చాలానే దొరుకుతున్నాయి. నచ్చిన రకాలను ఎంచుకోవచ్ఛు ఇవి భూమిపై వ్యర్థాలను మిగల్చకుండా పర్యావరణ హితంగా ఉంటాయి.


ఎరుపురంగు చుక్కతో...చెక్‌

నెలసరి విషయంలో అమ్మాయిల్లో ఉండే అపోహల్ని తొలగించి, ఆ సమయంలో పరిశుభ్రతను ప్రోత్సహించే దిశగా...యునిసెఫ్‌ ఇండియా రెడ్‌డాట్‌ ఛాలెంజ్‌ని నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపించగల ఆయా వ్యక్తులు.. తమ అరచేతిలో పెద్ద ఎరుపు రంగు చుక్కను పెట్టుకున్న ఫొటోని వారి ఖాతాల్లో పోస్ట్‌ చేస్తారు. నెల సరిపై వారి అభిప్రాయాల్ని, అపోహల్ని దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకతను చెబుతారు. హైదరాబాద్‌ అమ్మాయి, బాలీవుడ్‌నటి దియా మీర్జా సైతం ఈ రెడ్‌డాట్‌ ఛాలెంజ్‌లో పాల్గొంది. ‘రసాయనాలతో తయారుచేసిన న్యాప్కిన్లకు దూరంగా ఉండాలి. ఇవి వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు పర్యావరణానికీ హానికరం’ అంటారామె.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని