ఆమె సేవాగుణం కిడ్నీ ఇచ్చేంత
close
Published : 04/06/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె సేవాగుణం కిడ్నీ ఇచ్చేంత

సాయం చేయడం ఆమె బలం.. బలహీనత.. పిచ్చి! పైసా ప్రయోజనం ఆశించకుండా పరుల కోసమే జీవిస్తోంది. పదిమంది బాగు పడతారని ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసింది...ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి తన కిడ్నీనే దానం చేసింది...అయినవాళ్లను ఆదుకోవడానికే తటపటాయిస్తున్న ఈ రోజుల్లో తన సర్వస్వం ధారపోస్తున్న ఆ మహాతల్లి ఉమా ప్రేమన్‌...ఇరవై ఏళ్లుగా నిరుపేదలకు వెలుగు దివ్వెలా అండగా నిలుస్తున్న ఆమెను వసుంధర పలకరించింది.

ఇంటర్‌ చదివిన ఉమ.. భర్త ప్రేమన్‌తో ముంబయిలో అడుగుపెట్టింది. అందమైన జీవితాన్ని ఊహించుకుంది. ఆమెదేమో కోయంబత్తూరు. ఆయనదేమో కేరళలోని గురువాయూరు. కలతల్లేని కాపురం. అంతా బాగుందనుకుంటుండగా.. రహస్యంగా ఏవో మందులు వేసుకుంటున్నాడాయన. ఆమె దగ్గర ఇంకేదో దాస్తున్నాడు. కొన్నాళ్లకు అనారోగ్యం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇంకొన్నాళ్లకు అది క్షయ అని తేలింది. భర్తను నిలదీయలేదు. తోడుగా నిలిచింది. ఆయనతో కలిసి తనూ పోరాడింది. ఎన్నెన్నో ఆసుపత్రులకు తీసుకెళ్లింది. నాలుగేళ్లకు వారికి ఓ కొడుకు పుట్టాడు. పిల్లాడికి రెండేళ్లు నిండేసరికి ఆమె భర్త కన్నుమూశాడు.
నిరుపేదకు కిడ్నీ...
వైద్యుల సమాచారం.. రోగులకు చేరవేసే క్రమంలో చాలామంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు.. డయాలసిస్‌ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని గుర్తించింది. వాళ్లకు అండగా.. 20 ఏళ్ల కిందట ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసింది. కేరళలో ఉచిత డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 20 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను నెలకొల్పింది. కేరళ, తమిళనాడులో మొబైల్‌ డయాలసిస్‌ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. కిడ్నీ మార్పిడిపై అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. కిడ్నీలు పాడైన ఓ నిరుపేద యువకుడికి తన కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేసింది.

ఇల్లు అమ్మి...
భర్త పోయాడు. ఒళ్లో రెండేళ్ల బాబు. ఉండటానికి ఓ ఇల్లు. నెల రోజులు భారంగా గడిచాయి. భవిష్యత్తు కనిపించడం లేదు. భర్తతో కలిసి ఆసుపత్రులు తిరిగిన రోజులే వెంటాడసాగాయి. తనలా ఇంకెందరు సరైన వైద్యం కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అన్న ప్రశ్న మదిలో మెదిలింది. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. పుట్టెడు బాధతో సరైన వైద్యం కోసం ఎదురుచూసే రోగులకు గుప్పెడు సమాచారం అందివ్వాలనుకుంది. ఉన్న ఒక్క ఇంటినీ అమ్మేసింది. ఆసుపత్రులు, వైద్యుల వివరాలను రోగులకు సకాలంలో అందించడానికి ఓ సమాచార కేంద్రం స్థాపించింది. ‘ఎక్కడెక్కడ ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయి, ఏయే వ్యాధులకు ఏ వైద్యుడిని సంప్రదించాలి.. ఈ వివరాలన్నీ సేకరించా. వాటితో శాంతి మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను ప్రారంభించా. తిరిగి రోగులను కలుసుకొని, వ్యాధి గురించి తెలుసుకొని.. వారికి సరైన వైద్యం ఎక్కడ లభిస్తుందో చెప్పడమే పనిగా పెట్టుకున్నా. మా నాన్న చిరుద్యోగి. అవసరార్థులకు తోచిన వైద్యం అందించేవారు. ఆయనలోని సేవా గుణమే నాకు స్ఫూర్తి’ అంటోంది ఉమ.
గ్రామాన్ని దత్తత తీసుకొని..
సేవా పథాన్ని మరింత కొనసాగించింది. 2014లో కేరళలోని అట్టప్పాడి అనే గ్రామాన్ని దత్తత తీసుకుంది. అక్కడి గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. మహిళలకు రుణాలు ఇప్పించి టైలరింగ్‌, విస్తరాకులు, కాటన్‌ సంచుల తయారీ, శానిటరీ న్యాప్‌కిన్లు రూపొందించడంలో రాణించేలా ప్రోత్సహిస్తోంది. వీ గార్డ్‌ అనే సంస్థ సహకారంతో వడ్డీ లేని రుణాలు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించింది. సంక్షేమంతో అట్టప్పాడిని ‘శాంతి గ్రామంగా’ మార్చేసిందామె. ఆ గ్రామంలో పదుల సంఖ్యలో గృహిణులు స్వయంఉపాధి పొందుతున్నారు. ‘భవిష్యత్తులో గిరిజన విద్యార్థుల కోసం ఓ యూనివర్సిటీ స్థాపించాలని భావిస్తున్నా. వృద్ధులకు పునరావాస కేంద్రం, నిరుపేదలకు గృహం ఇలా ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నా. ఎల్‌ఐసీ వంటి పెద్ద సంస్థల ద్వారా అందుతున్న సహకారంతో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి’ అని చెబుతోంది ఉమ.


కళలను బోధిస్తూ

గిరిజన చిన్నారుల కోసం అట్టప్పాడిలో రెండేళ్ల కిందట ‘ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌’ పాఠశాలను ప్రారంభించింది ఉమ. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషలు నేర్పడంతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌, సంగీతం, నృత్యం వంటి కళలను బోధిస్తున్నారు. ఉచిత విద్య, పోషకాహారం అందిస్తున్నారు. 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని