ఈ జానపదాలు కోట్లు కొల్లగొట్టాయ్‌!
close
Published : 07/06/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ జానపదాలు కోట్లు కొల్లగొట్టాయ్‌!

గుండె బరువుకూ దరువుందంటే.. అది జానపదంలోనే! అందుకే ఎంతటి వారైనా.. ఆ పల్లెపదం చెవిన పడగానే కాలు కదుపుతారు. పాటల్లో పల్లెదనం పల్లవిస్తే.. మట్టివాసన పరిమళిస్తే.. అవి యూట్యూబ్‌కెక్కితే.. వైరల్‌ కాకుండా ఏమవుతాయి! పల్లెపాటను వైవిధ్యంగా పలికించి.. ఎందరో యూట్యూబ్‌ స్టార్లవుతున్నారు. వారిలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు మామిడి మౌనిక, శిరీష, లక్ష్మి. ఏడాది కాలంలో కోట్ల వీక్షణలు.. లక్షల్లో లైకులు కొల్లగొట్టి..  వసుంధరతో ఆ ముచ్చట్లు పంచుకున్నారు.


పాటల తల్లికి పాలాభిషేకం

శిరీషది సిరిసిల్ల. చేనేత కుటుంబం. తండ్రి ఆర్‌ఎంపీగా కూడా పనిచేసేవారు. ఆమె నాలుగో తరగతి చదివే రోజుల్లో జానపద గీతాలు నేర్చుకుంది. ఏ పాటైనా ఉత్సాహంగా పాడేది. తండ్రి ప్రోత్సాహం తోడైంది. కొన్నాళ్లకు జానపద కళాకారుడు గడ్డం రమేష్‌తో పరిచయమైంది. మొదట్లో ఎన్నికల పాటలు పాడేది. కొన్నాళ్లకు ‘అత్త కొడుక ముద్దుల మారెల్లయ్య’ జానపద గీతంతో యూట్యూబ్‌కెక్కింది శిరీష. ఆ పాట రెండు కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ‘ఏమే పిల్లా అన్నప్పుడల్లా..’ గీతం 6.8 కోట్ల వ్యూస్‌ కొల్లగొట్టింది. ‘పొడి పొడి వానలు’ పాట భారీ వ్యూస్‌ దక్కించుకుంది. ఏడాదిలోనే వంద జానపద గీతాలు పాడింది శిరీష. ‘అవి వింటుంటే నేనేనా పాడింది అనిపిస్తుంది. నా పాట లక్షల మంది ఆదరించడం సంతోషాన్నిస్తోంది. నా పుట్టినరోజు నాడు ఊళ్లో ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకం చేశారు. ఇంతటి గౌరవం దక్కిందంటే అది జానపదాల వల్లే’ అంటుంది శిరీష.


గుండె తడి.. అక్షరంగా చేసి

మౌనికది జగిత్యాల దగ్గరున్న చిన్నాపూర్‌. ఆమె తండ్రి బతుకుదెరువు కోసం గల్ఫ్‌ బాట పట్టాడు. తల్లి బీడీలు చుట్టేది. చిన్నప్పుడు బతుకమ్మ బావి దగ్గర ఉయ్యాల పాటలు పోటీపడి నేర్చుకుంది. బాగా పాడేది. ‘మా మామయ్య కాసర్ల భీమయ్య జానపదాలు పాడేవాడు. ఆయన స్నేహితుడే రచయిత, సంగీత దర్శకుడు మల్లిక్‌ తేజ్‌. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొన్ని పాటలకు కోరస్‌ పాడించాడు. అలా పాటల మీద ఆసక్తి మరింత పెరిగింద’ని చెబుతుంది మౌనిక. కొన్నాళ్లకు స్వయంగా పాటలు రాయడం మొదలుపెట్టిందామె. బావామరదళ్ల గురించి రాసిన ‘నేనొస్తా బావా మల్లన్నపేట’ పాట విని అందరూ మెచ్చుకున్నారు. ‘మల్లిక్‌ మామయ్య ఆ పాటను నాతో పాడించి యూట్యూబ్‌లో పెట్టారు. అది ఏకంగా రెండు కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. తర్వాత పాడిన ‘మదనా సుందారి’ పాట నాలుగు కోట్ల వ్యూస్‌ దక్కించుకుంది’ అని చెప్పుకొచ్చింది మౌనిక. గల్ఫ్‌ బాధితుల గుండెతడిని అక్షర బద్ధం చేసి రాసిన ‘సువ్వీ సువ్వన్నెలారా’ పాట ఓ సంచలనం అయింది. ‘ఆ పాట విని ‘మా గోడు ప్రపంచానికి చాటి చెప్పావ్‌ తల్లి’ అని గల్ఫ్‌ నుంచి ఫోన్‌ చేసి చెబుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అంటుంది మౌనిక. ఇప్పుడు ఆమె పాటలు పొలం గట్ల వెంబడి వినిపిస్తున్నాయి. ఆటోల్లో మార్మోగు తున్నాయి. వేలమందిని అలరిస్తున్నాయి. యూట్యూబ్‌తో కోట్ల మందికి చేరువవుతున్నాయి.


సెల్ఫీలు అడిగే స్థాయికి

ల్లెపదాలతోనే పెరిగింది లక్ష్మి. వాళ్ల అమ్మానాన్న పొలంలోకి దిగగానే పాటలు అందుకునేవారు. అవి వింటూ పెరిగిందామె. నిర్మల్‌ దగ్గరి గనోరా అనే పల్లెటూరు లక్ష్మిది.  బడిలో ఏకాపాత్రాభినయం చేసేది. పాటల పోటీల్లో పాల్గొనేది. శాస్త్రీయ నృత్యమూ చేస్తుంది. ‘ఓసారి బడిలో పాడుతుండగా దిగంబర్‌ సార్‌ చూశారు. మంచి బేస్‌ వాయిస్‌ అంటూ కొన్ని పాటలు నేర్పించారు. అలా ఇంటర్‌లో ఉండగా జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాడే అవకాశం దక్కింది’ అంటుంది లక్ష్మి. డిగ్రీలో ఉన్నప్పుడు ఆమె పాడిన పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. గడ్డం రమేష్‌తో కలిసి పాడిన ‘ఓ బావ సైదులు’ పాట ఎందరినో అలరించింది. ఇటీవల విడుదలైన ‘ఆనాడేమన్నంటినా తిరుపతి’ పాట 2.4 కోట్ల వ్యూస్‌ సొంతం చేసుంది. ‘గౌండ్లోళ్ల ఎల్లగౌడ’ పాట 1.1 కోట్ల వ్యూస్‌ దక్కించుకుంది. ‘అమ్మానాన్నకు ఇప్పుడు నేను అండగా ఉంటున్నా. బయటకు వెళ్తే నలుగురూ గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి?’ అంటుంది లక్ష్మి.

- అక్కల మనోజ్‌


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని