ఈ డిటెక్టివ్‌మహా యాక్టివ్‌
close
Published : 08/06/2020 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ డిటెక్టివ్‌మహా యాక్టివ్‌

వరుస హత్యలు...

అవీ ఒకే ఇంట్లో...

ఎవరు చేస్తున్నారో తెలియదు

ఎందుకు చేస్తున్నారో అస్సలు తెలియదు

భయం భయంగా బతుకున్నారు ఆ ఇంట్లోవాళ్లు

ఒకరినొకరు విశ్వసించడం లేదు

బయటివాళ్లను నమ్మడం లేదు

అప్పుడొచ్చిందామె!

పనిమనిషిగా వచ్చింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా నడుచుకుంది

తన పని తాను చేసుకుని పోయింది

హంతకుడిని పట్టుకున్నాక గానీ తెలియలేదు ఆమె పేరు ఆకృతి ఖత్రి అని! ప్రైవేట్‌ డిటెక్టివ్‌ అని!

‘‘ఏజెన్సీ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఒకే అమ్మాయి అసిస్టెంట్‌గా ఉండేది. ఒకట్రెండు చిన్న చిన్న కేసులు వచ్చేవి. మెల్లమెల్లగా మమ్మల్ని సంప్రదించేవారి సంఖ్య పెరిగింది. మా సిబ్బంది సంఖ్యా పెరుగుతూ వచ్చింది. దిల్లీ, హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మా శాఖలు పనిచేస్తున్నాయి. అన్ని శాఖల్లో కలిపి దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. వారిలో మహిళలే ఎక్కువ. ఆడవారిలో సహనం ఎక్కువ. ఎదుటివారిలో నమ్మకం కలిగించి కావాల్సిన సమాచారాన్ని రాబట్టగలరు. ఈ రంగానికి అమ్మాయిలు సరిగ్గా సరిపోతారు.

కృతి స్కూల్లో చదువుతున్న రోజులు..

ఎవరు పెన్సిల్‌ పోగొట్టుకున్నా.. పెన్ను చేజార్చుకున్నా.. అందరూ ఆకృతిని ఆశ్రయించేవారు. దొంగెవరో కనిపెట్టేసేది. ఎక్కడ పోగొట్టుకుందీ చెప్పేసేది.

కాలేజీ రోజుల్లోనూ అంతే! డిగ్రీ చదివేటప్పుడు ఆకృతికి అభిమానులూ ఉండేవారు. ఏ కొత్త విషయం గురించి తెలుసుకోవాలన్నా.. తనను సంప్రదించేవారు. విద్యార్థి దశ నుంచే డిటెక్టివ్‌ కావాలని కోరుకుందామె. దిల్లీకి చెందిన ఆకృతి తల్లిదండ్రులు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు. కూతురుకు అడిగినంత స్వేచ్ఛ ఇచ్చారు. కోరుకున్న రంగంలో ముందడుగు వేయడానికి ప్రోత్సహించారు. అలా 19వ ఏట ఉద్యోగం కోసం ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కంపెనీకి వెళ్లింది. ఇంటర్వ్యూ తర్వాత మర్నాడు వచ్చి విధుల్లో చేరమన్నారు. ఉత్సాహంగా వెళ్లింది. మొదటి రోజు ఖాళీగా కూర్చుంది. రెండో రోజూ ఏ పని చెప్పలేదు. మూడో రోజూ అంతే.. 24 రోజులైనా.. తనను పిలిచింది లేదు. పని చెప్పింది లేదు. అయినా సహనం కోల్పోలేదు. ఆ ఓపికే ఆమెను మేటి డిటెక్టివ్‌గా నిలబెట్టింది.

సినిమాల్లో చూసినట్టు కాదు..

ఆరేళ్లు గడిచిపోయాయి. మరింత రాటుదేలింది ఆకృతి. 2015లో సొంతంగా ‘వీనస్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ’ని ప్రారంభించింది. వందల కేసులు చాకచక్యంగా పరిష్కరించింది. దిల్లీలోనే కాదు.. ఏ నగరానికైనా వెళ్లిపోతుంది. ఏ ఊరికైనా చేరిపోతుంది. కాపుకాస్తుంది. తీగ లాగుతుంది. డొంక కదిలిస్తుంది. ‘సినిమాల్లో చూపించినట్టు నెత్తిన టోపి.. చేతిలో కర్ర.. మెడలో బైనాక్యులర్‌తో ఉండరు డిటెక్టివ్‌ అంటే! రకరకాల అవతారాలు ఎత్తాలి. తెలివిగా అడుగెయ్యాలి. ఎవరికి అనుమానం వచ్చినా.. ప్రాణాలకే ప్రమాదం’ అని చెబుతుంది ఆకృతి. కేసుల పరిశోధన కోసం ఎంతవరకైనా వెళ్తుందామె. త్వరగా సాధిస్తుందన్న పేరు సంపాదించుకుంది. ‘పలు సంస్థలు ఇంటిదొంగను పట్టుకొమ్మని వస్తుంటాయి. కాబోయే భార్య, భర్త గురించి తెలుసుకోవాలని కొందరు వస్తారు. పిల్లల ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరా తీయమంటూ తల్లిదండ్రులు సంప్రదిస్తారు.. ఇలా రకరకాల కేసులు వస్తుంటాయి’ అంటుంది ఆకృతి. వీటిని పరిష్కరించడంలో ఒక్కో కేసుకు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారామె! మొక్కజొన్న పొత్తులు అమ్మే అమ్మిగా, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా, బిచ్చగత్తెలా, పనిమనిషిలా.. గెటప్‌లు మార్చేస్తుంది. సంగతులన్నీ శోధిస్తుంది. సమస్యలన్నీ తీరుస్తుంది. ‘నిఘాలో భాగంగా రోజుల తరబడి వేచి ఉండాల్సివస్తుంది. ఒక్కోసారి ప్రమాదం ముంచుకొస్తుంది. అప్పుడు మన తెలివితేటలతో తప్పించుకోగలగాలి’ అంటుంది ఆకృతి. తాను కోరుకున్న రంగంలో స్థిరపడటమే కాదు.. మరెందరికో ఉపాధి కల్పించి తన దారిలో నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

రంగంలోకి దిగితే..

దిల్లీలో ఓ సంపన్నుల కుటుంబంలో వరుస హత్యలు కలకలం రేపాయి. పోలీసుల విచారణ మొదలైంది. ఆ మిస్టరీని ఛేదించాలని ఆ ఇంటాయన ఆకృతిని సంప్రదించాడు. పనిమనిషిగా అడుగుపెట్టింది. పనులన్నీ చేస్తూనే.. కావాల్సిన సమాచారమంతా సేకరించింది. మూడునెలల తర్వాత ఆధారాలతో పనిమనుషులే అసలు హంతకులని బయటపెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమ్మాయి కిడ్నాప్‌ కేసును పరిష్కరించింది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని