స్టవ్‌లు, కుక్కర్లు, చిమ్నీలు అన్నింటా ఆమె బ్రాండ్‌!
close
Published : 28/06/2020 03:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టవ్‌లు, కుక్కర్లు, చిమ్నీలు అన్నింటా ఆమె బ్రాండ్‌!

పాకశాస్త్రంలో మహిళల ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంటావార్పులో ఉపయోగపడే వస్తువుల తయారీలో మాత్రం వారి పాత్ర అంతంత మాత్రమే! ఈ సంప్రదాయాన్ని మార్చేశానంటోంది స్టవ్‌క్రాఫ్ట్‌ హోమ్‌ అప్లయిన్సెస్‌ సంస్థ డైరెక్టర్‌ నేహా గాంధీ. తయారీ రంగంలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ.. వారి ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పిస్తోంది.  మార్కెటింగ్‌లోనూ మగువలను ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తోంది.
వండేవారికి, తినేవారికి రిటైర్మెంట్‌ ఉండదన్నది నిజం. ఈ సూత్రానుసారం వండడానికి ఉపయోగించే వస్తువులకు అన్నికాలల్లో డిమాండ్‌ ఉంటుందంటే ఒప్పుకోవాల్సిందే. ఈ నిజాన్ని గ్రహించే నేహ తండ్రి రెండున్నర దశాబ్దాల కిందట వంటింటి ఉపకరణాల తయారీ రంగంలోకి ప్రవేశించారు. ఇప్పుడు అదే సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది నేహ. బెంగళూరు శివారులో హరోహళ్లికి దగ్గర్లో ఉంటుంది స్టవ్‌క్రాఫ్ట్‌ పరిశ్రమ. రెండున్నర వేలమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తుంటారు. వారిలో సింహభాగం మహిళలే. దాదాపు 80 శాతం వాటా వారిదే! సమర్థత ఎంతున్నా.. ఉత్పత్తి రంగంలో మహిళలకు అవకాశాలు తక్కువే. భారీ యంత్రాలతో పని, శారీరక శ్రమ, పని గంటలు వెరసి మగువలు ఈ రంగంవైపు అడుగులు వేయకుండా చేశాయి. పరిశ్రమల్లో కొలువుదీరినా.. ప్యాకింగ్‌, లేబుల్స్‌ అతికించడం వంటి చిన్న చిన్న పనులు చేయాల్సిన పరిస్థితి. స్టవ్‌క్రాఫ్ట్‌లో ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. భారీ యంత్రాలతో కుస్తీ పడుతున్న స్త్రీలు కనిపిస్తారిక్కడ. విడిభాగాలను చకచకా జోడిస్తూ మిక్సీగా మార్చేసే మహిళలు ఉంటారు. నేహ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాతే పరిశ్రమలో మహిళల ప్రాధాన్యం పెరిగింది.
మహిళలకే ప్రాధాన్యం..
బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచులర్‌ డిగ్రీ చదివింది నేహ. అహ్మదాబాద్‌ ముద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ నుంచి సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా చేసింది. చదువుకునే రోజుల్లోనే తండ్రి రాజేంద్ర గాంధీతో కలిసి బిజినెస్‌ ట్రిప్‌లకు వెళ్తూ ఉండేదామె. చదువు పూర్తయిన తర్వాత.. ఆసక్తితో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పటికే స్టవ్‌క్రాఫ్ట్‌కు మంచి పేరుంది. దేశంలోనే అత్యధిక గ్యాస్‌స్టవ్‌లు ఉత్పత్తి చేస్తున్న రికార్డూ ఉంది. అయినా.. ఈ తరానికి ప్రతినిధి అయిన తన కూతురు కొత్తగా ఏదైనా సాధిస్తుందని విశ్వసించారు రాజేంద్ర గాంధీ. అలా మూడేళ్ల కిందట వ్యాపారంలోకి అడుగుపెట్టిందామె. మార్కెటింగ్‌ డివిజన్‌ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించింది. ‘ఎప్పటికైనా మా నాన్న బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుందని తెలుసు. మార్వాడీల కుటుంబం కావడంతో వ్యాపార లక్షణాలు నా రక్తంలోనే ఉన్నాయేమో!’ అని అంటుంది 28 ఏళ్ల నేహ. తండ్రి ఆశలకు.. తన ఆశయాలు జోడించి.. వ్యాపారవృద్ధిలో తన మార్కు చూపించింది. మార్కెటింగ్‌లోనూ మహిళలకు అవకాశాలు కల్పించింది. రీజినల్‌ సేల్స్‌ మేనేజర్లుగా స్త్రీలను నియమించింది. పరిపాలనా విభాగంలో యువతులకు అవకాశాలు ఇచ్చింది. ‘ఏ పనినైనా మహిళలు ఎక్కువ శ్రద్ధతో చేస్తారు. వారి సమర్థతను గుర్తించడమే మనం చేయాల్సింది’ అంటుంది నేహ. మూడు షిఫ్టులుగా పనులు జరుగుతున్నా.. మహిళలు ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ల్లోనే పనిచేస్తారు.
12 దేశాల్లో అమ్మకాలు...
మహిళా సాధికారతకు కృషి చేస్తూనే.. తమ ఉత్పత్తులకు బహుళ ప్రజాదరణ కల్పించడంలోనూ సఫలమైంది నేహ. ప్రెజర్‌ కుక్కర్‌ నుంచి నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌, మిక్సర్‌ గ్రైండర్‌, చిమ్నీలు ఇలా ఎన్నో ఉత్పత్తులతో కిచెన్‌ అప్లయిన్సెస్‌ రంగంలో స్టవ్‌క్రాఫ్ట్‌ను కేరాఫ్‌గా నిలబెట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డీలో ఉన్న కంపెనీ మరో యూనిట్‌ సామర్థ్యాన్నీ పెంచింది. పీజియన్‌, గిల్మా వంటి బ్రాండ్‌లు స్టవ్‌క్రాఫ్ట్‌ ఉత్పత్తులే. పిజియన్‌లో 600, గిల్మాలో 40 రకాల ఉత్పత్తులు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలతో పాటు 12 దేశాల్లోనూ మార్కెటింగ్‌ చేస్తూ.. తన సమర్థతను నిరూపించుకుంది.  కంపెనీ ప్రతిష్ఠను పెంచుతూ.. డైరెక్టర్‌ హోదాకు చేరుకుంది నేహ. కంపెనీ బాధ్యతలు చేపట్టాక మీరేం సాధించారని అడిగితే.. ‘పరిశ్రమ మూలాలు మార్చలేకపోవచ్చు. కానీ, ఉద్యోగుల ప్రాధాన్యం, ఆధునికీకరణ, నైపుణ్యాల గుర్తింపులో నేను ఆశించింది సాధించగలిగాను’ అంటుంది నేహ.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని