మినిమం డ్యూ కడుతున్నారా?..ఆలోచించండి!

వార్తలు / కథనాలు

మినిమం డ్యూ కడుతున్నారా?..ఆలోచించండి!

ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డు వాడకం సర్వ సాధారణమైపోయింది. డబ్బులు తర్వాత కట్టుకోవచ్చనో, కార్డు ఉంది కదా వాడేద్దాంలే అన్న ఉద్దేశంతోనో చాలా మంది చిన్న చిన్న అవసరాలకు కూడా స్వైప్‌ చేసేస్తుంటారు. అంతేకాకుండా కంపెనీ అవకాశమిచ్చింది కదా అని మినిమం డ్యు కడుతూ అప్పును పెంచుకుంటారు. ఓ ప్రణాళికా బద్ధంగా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డుతో చాలా లాభమే. అదే సమయంలో ఖర్చుపై నియంత్రణ లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్‌కార్డు ఉపయోగించడం గురించి బాగా తెలిసిన వారు ‘మినిమం డ్యు’ కట్టడానికి ఆలోచిస్తారు..ఎందుకో తెలుసా..? 

మినిమం డ్యు చెల్లించడం వల్ల వినియోగదారుల కంటే బ్యాంకర్లకే ఎక్కువ ప్రయోజనం. అదెలాగో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చాలా వరకు క్రెడిట్‌ కార్డు కంపెనీలు మీరు వాడిన మొత్తంలో 5 శాతాన్ని మినిమం డ్యు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రూ.30,000 క్రెడిట్‌ కార్డు నుంచి ఉపయోగిస్తే బిల్లు చెల్లింపు తేదీన రూ.1500 కడితే సరిపోతుంది. మిగతా 28,500 తర్వాతి బిల్లులో కట్టాల్సి ఉంటుంది. అయితే దీనిపై నెలకు 3 నుంచి 4 శాతం వడ్డీ వేస్తారు. అవసరమనుకుంటే దీనిని కూడా తర్వాత నెలలో కూడా కట్టుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు వడ్డీ ఎలా లెక్కిస్తారు?

క్రెడిట్‌ కార్డు వాడుతున్నప్పటికీ దానిపై వడ్డీ ఎలా లెక్కిస్తారో చాలా మందికి తెలియదు. మీ క్రెడిట్‌ కార్డుకు ప్రతి నెలా 15న బిల్‌ జనరేట్‌ అవుతుంది అనుకుందాం. ఆ తర్వాతి నెల 5న మీరు బిల్‌ కట్టాల్సి ఉంటుంది. మీరు సెప్టెంబర్‌ 17న రూ.10,000 కొనుగోలు  చేశారనుకుందాం. దీని బిల్లు అక్టోబర్ 15న జనరేట్‌ అవుతుంది. నవంబర్‌ 5న బిల్‌ కట్టాలి. ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి. 1. బిల్లు పూర్తిగా చెల్లించడం. 2. మినిమం డ్యు చెల్లించడం. 3. పూర్తిగా చెల్లించకపోవడం. మొదటి ఆప్షన్‌లో మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఎలాంటి వడ్డీ పడదు. రెండో ఆప్షన్‌లో మినిమం డ్యు రూ.500 కట్టేశారు కాబట్టి, మిగతా 9,500కి 3 శాతం వడ్డీ పడుతుంది. ఒకవేళ కట్టకపోతే చేసిన మొత్తం రూ.10,000కి వడ్డీ+ ఆలస్య రుసుము రూ.400 పడుతుంది. అయితే వినియోగదారులు తెలియకుండా నష్టబోయే రెండో ఆప్షన్‌ గురించి కాస్తా వివరంగా తెలుసుకుందాం.

మీరు రూ.500 మినిమం డ్యు కట్టేసిన తర్వాత నవంబర్‌ 12న మరో రూ.7,000 కొనుగోలు చేశారనుకుందాం.ఆ బిల్లు నవంబర్‌ 15న జనరేట్‌ అవుతుంది. అప్పుడు మీ బిల్లు ఎలా లెక్కిస్తారో ఒక్కసారి చూడండి. రూ.9500(పాత బిల్లు) + దానిపై సెప్టెంబర్‌ 17 నుంచి నవంబర్‌ 15 వడ్డీ+ 7000( కొత్త కొనుగోలు)+ (రూ.7,000కు నవంబర్‌ 12 నుంచి నవంబర్‌ 15 వరకు వడ్డీ). ఇక్కడ మీరు సరిగా గమనిస్తే.. రెండోసారి కొనుగోలు చేసిన వాటికి కూడా వడ్డీని లెక్కించారు. 

నిజానికి రెండోసారి కొనుగోలు చేసిన మొత్తానికి వడ్డీ పడకూడదు. కానీ, బిల్‌ డ్యు ఉన్నప్పుడు ఫ్రీ పీరియడ్‌ వర్తించదు. మీరు కొనుగోలు చేసిన తర్వాతి రోజు నుంచే వడ్డీని లెక్కిస్తారు. మినిమం డ్యు కట్టేశాం కదా.. వడ్డీ పడదులే అనుకుంటే నడ్డి విరిగినట్లే. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తప్ప మినిమం డ్యు కట్టడం అంత మంచి పద్ధతి కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రెడిట్‌కార్డు అత్యవసరాల్లో ఉపయోగమే, కానీ, ఆర్థిక క్రమశిక్షణతో ఉపయోగించుకుంటే మంచిదని చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న