‘దోషి లావుగా ఉన్నాడు.. జైలుకు పంపలేం’

వార్తలు / కథనాలు

‘దోషి లావుగా ఉన్నాడు.. జైలుకు పంపలేం’

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేరం చేసిన ఎవరైనా జైలు శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి తాను నేరం చేసినట్లు కోర్టులో ఒప్పుకొన్నా.. ఆయన్ను జైలుకు పంపడానికి న్యాయమూర్తి నిరాకరించారు. ఆశ్చర్యంగా ఉంది కదా! కారణం తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. దోషి లావుగా ఉండటమే అందుకు కారణమట. 

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన పీటన్‌ జాన్‌ ఒనీల్‌ అనే 61 ఏళ్ల వ్యక్తి గతంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసి విచారణ జరపగా.. ఇటీవల పీటర్‌ తను చేసిన తప్పులు ఒప్పుకొన్నాడు. దీంతో అతడు దోషిగా తేలినా లావుగా ఉన్నాడని జైలుకు పంపేందుకు న్యాయమూర్తి నిరాకరించాడు. గతంలో ఫిట్‌గానే ఉన్న పీటర్‌ తర్వాత లావుగా మారిపోయాడు. ఎంతలా అంటే ప్రస్తుతం ఇప్పుడు అతడు నడవలేడు. భారీకాయంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన పీటర్‌ మరొకరి సాయం లేకుండా ఏ పని చేయలేడు. పైగా అనారోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని జైలుకు తరలించాలంటే మెడికల్‌ హెలికాప్టర్‌లో తీసుకెళ్లి.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందట. ఇందుకోసం కనీసం 40వేల డాలర్లు(రూ. 30లక్షలు) ఖర్చవుతాయని కోర్టు పేర్కొంది. 

అందుకే ప్రస్తుతం పీటర్‌ను జైలుకు పంపకూడదని న్యాయమూర్తి నిర్ణయించారు. అయితే అతడికి జైలు ఎలా పంపాలి? జైలు శిక్ష విధించగలమా లేదా అనే విషయాలపై విచారణ జరిపి తర్వాత తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. అప్పటి వరకు అతడు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఒకరి సాయం లేకుండా కదలలేడు కాబట్టి.. అతడిపై పోలీసుల నిఘా కూడా అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే కోర్టు నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు. లావుగా ఉన్నంత మాత్రనా చేసిన తప్పుకు శిక్ష విధించకుండా ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ విధంగా కాకపోయినా ఏదో రకంగా అతడికి శిక్ష తప్పక పడుతుందని  అంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న