పోస్ట్‌ పెట్టేస్తారు.. కోట్లు పట్టేస్తారు!!

వార్తలు / కథనాలు

పోస్ట్‌ పెట్టేస్తారు.. కోట్లు పట్టేస్తారు!!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌.. ఇప్పుడు యువతలో మార్మోగుతున్న పేరు. గంటకో పోస్ట్‌, అరగంటకో స్టోరీతో సోషల్‌ వేదికలో సందడి చేస్తున్నారు. కానీ మీకు తెలుసా! అలా ఓ పోస్ట్‌, సింపుల్‌ స్టోరీతో కోట్లు సంపాదిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. మరి అలా ఇన్‌స్టాలో ప్రమోషనల్‌ పోస్ట్‌తో రూ.కోట్లు పట్టేస్తున్న ఆ తారలెవరో చూద్దామా!

ప్రియాంక చోప్రా

 

చూడచక్కనైన రూపం.. ఆకట్టుకునే అందం ప్రియాంక సొంతం. తన నటన, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇక నిక్‌ జోనస్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె క్రేజ్‌ హాలీవుడ్‌లో మరింత పెరిగింది.  ప్రస్తుతం దేశంలో ఇన్‌స్టా ప్రమోషనల్‌ పోస్ట్‌కి ఎక్కువ మొత్తంలో డబ్బు అందుకుంటున్న వారిలో ప్రియాంక మొదటి స్థానంలో ఉంది. మరి ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ ప్రమోషనల్‌ పోస్ట్‌కి తను ఎంత అందుకుంటుందో తెలుసా? అక్షరాల కోటీ ఎనబై ఏడు లక్షలు. ఇక తన ఇన్‌స్టాలో 58.5మిలియన్ల ఫాల్లోవర్లున్నారు. దేశంలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు కలిగిన వ్యక్తుల్లో రెండో స్థానంలో ఉంది ప్రియాంక.

విరాట్‌ కోహ్లీ


బాలీవుడ్‌ హీరోలకు సైతం పోటీనిచ్చే అందగాడు విరాట్‌ కోహ్లీ! కేవలం తనో ఆటగాడు మాత్రమే కాదు. ఓ యూత్‌ ఐకాన్‌. డైట్‌, ఫిట్‌నెస్‌, స్టైల్‌, వ్యక్తిత్వం ఇలా అన్నింటిలోనూ యువతకి ప్రేరణగా నిలుస్తూ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా వ్యాపార సంస్థ తరఫున ప్రచారం చేయడంలో భాగంగా కోహ్లీ ఓ పోస్టుకి రూ.1.35 కోట్లను సంబంధిత కంపెనీ చెల్లిస్తుంది. దేశంలో ఇన్‌స్టా ప్రమోషనల్‌ పోస్ట్‌కి అధిక డబ్బు అందుకుంటున్న వారిలో విరాట్‌ రెండో స్థానంలో ఉన్నాడు. తన ఇన్‌స్టాలో ప్రస్తుతం 82.8మిలియన్ల ఫాలోవర్లున్నారు. దేశంలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు కలిగిన వ్యక్తుల్లో మొదటి స్థానం కోహ్లీ సొంతం. 

దీపికా పదుకొణె

చిన్ని చిరునవ్వు చాలు అభిమానుల గుండెల్ని కొల్లగొట్టేందుకు.. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆమే దీపికా పదుకొణె. తన నటనతో బాలీవుడ్‌ కథానాయికల్లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఓ సినిమాకి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటున్న బాలీవుడ్‌ తారల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇక దీపికా ఇన్‌స్టాలో ఓ వ్యాపార సంస్థ తరఫున పోస్ట్‌ చేసే ఒక ప్రమోషనల్‌ పోస్ట్‌ కోసం ఎంత డబ్బు అందుకుంటుందో తెలుసా! అక్షరాల కోటీ ఇరవై ఐదు లక్షలు. ప్రస్తుతం దీపికకు ఇన్‌స్టాలో 52.3మిలియన్ల ఫాల్లోవర్లున్నారు. ఒత్తిడిని చిత్తు చేసేందుకు, మానసిక వేదనతో బాధ పడే వారికోసం చిట్కాలను తరచూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది.

అలియా భట్‌


చిన్నవయసులోనే విలక్షణ నటిగా పేరుపొంది అత్యధిక మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది అలియా. గత ఐదేళ్లలో 10సినిమాలు చేసి అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో విమర్శకులను సైతం మెప్పిస్తోంది. పాత్ర ఏదైనా ఒదిగిపోవడం అలియా ప్రత్యేకత. ఇక సోషల్‌ వేదికల్లోనూ చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టా ప్రమోషనల్‌ పోస్ట్‌ కోసం ఆలియా రూ.1.22కోట్లు తీసుకుంటోంది. ఇలా ఇన్‌స్టా ప్రమోషనల్‌ పోస్ట్‌కి అధిక డబ్బు అందుకుంటున్న వారిలో నాలుగో స్థానంలో ఉంది ఆమె. ఈ మధ్యే ఇన్‌స్టాలో 5కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన ఇన్‌స్టాలో 50.2మిలియన్ల ఫాలోవర్లున్నారు.

శ్రద్ధా కపూర్‌

శక్తి కపూర్‌ నట వారసురాలిగా సినీ ప్రపంచానికి పరిచయమైంది శ్రద్ధా కపూర్‌. తన నటన, అందంతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటుందీ సాహో ముద్దుగుమ్మ. లాక్‌డౌన్‌ సమయంలో అనేక పోస్ట్‌లతో అభిమానులకు మరింత చేరువైంది. ఇక ఇన్‌స్టాలో ఓ వ్యాపార సంస్థ తరఫున పోస్ట్‌ చేసే ఒక ప్రమోషనల్‌ పోస్ట్‌ కోసం సంబంధిత కంపెనీ తనకి రూ.1.18కోట్లు చెల్లిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక సమయం గడిపే శ్రద్ధా ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకొని దేశంలో ఇన్‌స్టా అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారి జాబితాలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం తన ఇన్‌స్టాలో 56.8మిలియన్ల ఫాలోవర్లున్నారు.

షారుక్‌ ఖాన్‌

ఆయన సినిమా కోసం ఎదురు చూసేవారెందరో..  ఫొటోకోసం ఏళ్లతరబడి నిరీక్షిస్తున్నవారెందరో.. తన స్టైల్‌తో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఒక్క పోస్ట్‌కి లక్షల లైకులు, వేలల్లో కామెంట్‌లు.. ఆయనే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌. కేవలం సినిమాల్లోనే కాదు. సామాజిక మాధ్యమాల పోస్ట్‌లలోనూ ముందుంటాడీ సూపర్‌స్టార్‌. అభిమానులకు చెప్పదలచుకుంది తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటాడు. తన ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ ప్రమోషనల్‌ పోస్ట్‌ కోసం కోటి రూపాయల వరకూ అందుకుంటాడు. ప్రస్తుతం తన ఇన్‌స్టాలో 23.5మిలియన్ల ఫాల్లోవర్లున్నారు.

అక్షయ్‌ కుమార్‌


తన సినీ కెరీర్‌ ఆరంభించడానికి ముందు డబ్బు కోసం ఎన్నో ఉద్యోగాలు చేశాడు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ఒకప్పుడు రెస్టారెంట్‌ వెయిటర్‌గా పనిచేసిన ఆయన కోట్లు సంపాదించి ఫోర్బ్స్‌ జాబితాతో చోటు దక్కించుకున్నాడు. యాక్షన్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు అక్షయ్‌. తన సినిమా అప్‌డేట్స్‌ని, డైట్, ఫిట్‌నెస్‌ రహస్యాలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. ఇన్‌స్టాలో ఓ వ్యాపార సంస్థ తరఫున పోస్ట్‌ చేసే ఒక ప్రమోషనల్‌ పోస్ట్‌ కోసం ఎంత డబ్బు అందుకుంటాడో తెలుసా! అక్షరాల కోటి రూపాయలు. ప్రస్తుతం తన ఇన్‌స్టాలో 47.2మిలియన్ల ఫాలోవర్లున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న