తన ఏడాది జీవితాన్ని రికార్డు చేశాడు!

వార్తలు / కథనాలు

తన ఏడాది జీవితాన్ని రికార్డు చేశాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించిన ‘బిగ్‌ బాస్‌’ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే కదా..! తెలుగులోనూ నాలుగో సీజన్‌ రాబోతోంది. ఈ కార్యక్రమంలో కొందరిని ఓ ఇంట్లోకి పంపి అటు ఇటుగా ఓ 100 రోజులపాటు ఉంచుతారు. ఆ ఇంట్లో వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం తింటున్నారు? ఇలా వారి జీవితంలోని 100 రోజులను ఆ ఇంట్లో అమర్చిన పదుల సంఖ్యలో కెమెరాలు రికార్డు చేస్తుంటాయి. అదే తరహాలో ఓ వ్యక్తి ఏకంగా ఏడాదిపాటు తన జీవితాన్ని రికార్డు చేశాడు. తిరిగి ఆ వీడియోలు చూసుకుంటే తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెబుతున్నాడు.

అమెరికాకు చెందిన మైఖేల్‌ గేర్రీకి కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన తర్వాత ఏం చేయాలో తోచలేదట. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడట. అయితే ఒకతను వారం పాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ పెట్టడం చూసి తానూ అలా ప్రయత్నించాలని భావించాడు. దీంతో గతేడాది జనవరిలో తన ఇంట్లో బాత్‌రూమ్‌ సహా.. అన్ని గదుల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకొని తను గడిపే ప్రతి క్షణాన్నీ రికార్డు చేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు గోడలకు అమర్చిన కెమెరాలు.. కంప్యూటర్‌ ముందు కూర్చుంటే వెబ్‌కెమెరా.. బయటకు వెళ్తే తన భుజంపై, చేతిలో కెమెరాలు పెట్టుకొని రికార్డు చేయడం మొదలుపెట్టాడు. ఉదయం లేవగానే కాలకృత్యాల నుంచి పడుకునే వరకు.. పడుకున్న తర్వాత కూడా గేర్రీ తనను తాను రికార్డు చేసుకున్నాడు. ఎంతోమంది డిజిటల్‌ కంటెంట్‌ను రూపొందిస్తున్నారని, అందుకే తన రికార్డింగ్‌ వీడియోలనే డిజిటల్‌ కంటెంట్‌గా మార్చి సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టు చేసినట్లు గేర్రీ చెప్పుకొచ్చాడు. అలా ఏడాదిపాటు తన జీవితాన్ని రికార్డు చేశాడు. 

ఎప్పటికప్పుడు రికార్డు చేసిన వీడియోలను చూసుకోవడం వల్ల తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని గేర్రీ అంటున్నాడు. మొదట్లో ఎంతో బద్ధకంగా ఉంటూ ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే అతను.. క్రమంగా మారిపోయాడట. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఇతరులతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకున్నాడట. అంతేకాదు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా పోయిందట. ఏడాది జీవితం రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత గేర్రీ తన అనుభవాలకు అక్షర రూపం ఇస్తున్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు తన ఆలోచనలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న