ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే జిమ్‌సన్‌లు వస్తారు..!

వార్తలు / కథనాలు

ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే జిమ్‌సన్‌లు వస్తారు..!


(ఫొటో: డెలివరీ మాచో)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో రెస్టారెంట్లు మూతపడిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా వాటి యజమానులు ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల అనుమతిచ్చినా గతంతో పోలిస్తే వినియోగదారుల రాక బాగా తగ్గింది. జపాన్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. దీంతో అక్కడి ఓ రెస్టారెంట్‌ యజమాని వినూత్నంగా ఆలోచించి.. దేశ జనమంతా తన రెస్టారెంట్‌ గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఇంతకీ ఏం చేశాడంటే..?

జపాన్‌లోని అంజో ప్రాంతంలో 60 ఏళ్ల మసనొరి సుగిరాకి ‘ఇమజుషి’ పేరుతో ఓ రెస్టారెంట్‌ ఉంది. కరోనా రాక ముందు అతడి రెస్టారెంట్‌ నిత్యం కస్టమర్లతో కళకళలాడేది. భారీగా ఆదాయం వచ్చేది. కరోనా కారణంగా రెస్టారెంట్‌కు కస్టమర్ల రాక తగ్గింది. ప్రజలంతా ఇంటి వంటకే జై కొడుతుండడంతో అతడికి ఓ ఆలోచన తట్టింది. 

మసనొరికి యుక్త వయసు నుంచి జిమ్‌కి వెళ్లడం అలవాటు ఉందట. ప్రస్తుతం జిమ్‌లకు ఆదాయం లేకపోవడంతో తనకు స్నేహితులుగా మారిన జిమ్‌ యజమానులు, జిమ్‌ మాస్టర్లు.. ఉపాధి లేని తోటి జిమ్‌ మేట్లను తన రెస్టారెంట్లో డెలివరీ బాయ్స్‌గా నియమించుకున్నాడు. ‘డెలివరీ మాచో’ పేరుతో సేవలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా కండల వీరులంతా షర్ట్‌ లేకుండా వారి దేహదారుఢ్యాన్ని ప్రదర్శిస్తూ ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను కస్టమర్లకు హోం డెలివరీ చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న కస్టమర్లు ఆ రెస్టారెంట్‌ నుంచి ఆహారాన్ని తెప్పించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆహారాన్ని పట్టుకొచ్చే కండల వీరులతో ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో ఇమజుషి రెస్టారెంట్‌ పేరు జపాన్‌ వ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌ హోం డెలివరీ సేవలు అంజో ప్రాంతంతో పాటు నగొయాలోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు కావాలంటే కనీసం 66 డాలర్ల విలువ చేసే ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేయాల్సి ఉంటుందట. త్వరలో జపాన్‌లోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి సేవలు అందించేందుకు మసనొరి సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఆయా నగరాల్లోని కండలవీరుల్ని నియమించుకునే పనిలో పడ్డాడు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడమంటే ఇదేనేమో..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న