అతి అంతర్జాలంతో నష్టమే..

వార్తలు / కథనాలు

అతి అంతర్జాలంతో నష్టమే..

విద్యార్థులు ఇంటర్నెట్‌ను అతిగా వినియోగిస్తే అనర్థకమేనని  ఇటలీలోని మిలాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది.  ఎక్కువగా నెట్‌ వాడి పరీక్షల ముందు ఉత్కంఠకు లోనవుతుంటారని పరిశోధనలో వెల్లడయింది.  దీంతో పాటు నెట్‌ను వినియోగంతో ఒంటరితనం వేధిస్తుందనని వారు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా 85 మంది విద్యార్థులు పాల్గొన్నారు.  డిజిటల్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న తరుణంలో  విద్యానైపుణ్యాలు,  ఆతృత, ఒంటరితనం .. తదితర అంశాలను పరిశీలించారు. ఎక్కువగా నెట్‌ను వాడుతున్న విద్యార్థులు తరగతి గదుల్లో అధ్యాపకులు చెప్పే పాఠాలను నేర్చుకోవడంలో వెనకబాటుకు లోనవుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరి కంటే నెట్‌ను తక్కువగా వినియోగించే విద్యార్థులు చదువులో   ముందంజలో ఉన్నారని రుజువైంది.

పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి..
స్మార్ట్‌ యుగంలో తమ పిల్లలకు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనిస్తున్న పెద్దలు ఈ అంశంపై జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.  విపరీతమైన నెట్‌ వాడకం పలు విపరీత పరిణామాలకు దారి తీస్తుందని వారు హెచ్చరించారు. ప్రత్యేకించి ఒంటరితనంతో వారు చదువుపై శ్రద్ద వహించలేకపోవచ్చన్నారు. 

కలివిడిగా ఉండాలి..
విద్యార్థులు కలివిడిగా ఉండాలని అప్పుడే  వారిలో మంచి ఆలోచనలు ఏర్పడుతాయని నిపుణులు తెలిపారు.  ఇంటర్నెట్‌ వాడకంతో ఒంటరితనం ఎక్కువై చదువులో వెనకబడిపోవడంలో వారిలో ఆత్మనూన్యత ఏర్పడుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. నెట్‌కు దూరంగా ఉండేందుకు విద్యార్థులు బృందచర్చలు జరపడం, ఆరుబయట ఆటలు అలవరుచుకోవాలని సూచించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న