ఒక దీవి..ఓ మహిళ.. 31 మంది సైనికులు

వార్తలు / కథనాలు

ఒక దీవి..ఓ మహిళ.. 31 మంది సైనికులు

అనతహన్‌.. పసిఫిక్‌ సముద్రంలోని చిన్నదీవి.. కేవలం 13 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన దీవిలో 31 మంది జపాన్‌ సైనికుల మధ్య ఒక మహిళ ఐదేళ్ల పాటు జీవించింది... 1950లో ఆమెను తీరంలో గుర్తించిన అమెరికా నౌకాదళం రక్షించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అయితే 1945లోనే రెండో ప్రపంచయుద్దం ముగిసినా  అక్కడి జపాన్‌ సైనికులు నమ్మలేదు.అమెరికాతో తమ పోరాటం కొనసాగుతోందని భావించారు. చివరకు 1951లో వారు లొంగిపోయారు.

నౌకలు మునిగిపోవడంతో..
1944లో అనతహన్‌ దీవి సమీపంలో మూడు జపాన్‌ నౌకలపై అమెరికా వాయసేన బాంబుల వర్షం కురిపించడంతో జపాన్‌ నౌకలు మునిగిపోయాయి. 31 మంది జపాన్‌ సైనికులు మాత్రం ప్రాణాలతో బతికి సమీపంలోని అనతహన్‌ దీవికి చేరుకున్నారు. అప్పటికే ఆ దీవిలో షోయిచి హిగ ఆయన భార్య కజుకొతో కలిసి  అక్కడ వ్యవసాయం చేసేవారు. తన సోదరిని చూడాలని షోయిచి హిగ అక్కడ నుంచి వెళ్లాడు. అతను ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో యజమాని కికైచిరో కజుకొను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో 31 మంది సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారికి ఆ దంపతులు ఆశ్రయమిచ్చారు. 1946లో కికైచిరో కన్నుమూశాడు. దీంతో ఆ దీవి మొత్తానికి కజుకో యజమానిగా మారింది.

వరుసగా 11 మంది మరణం..

దీంతో 31 మందిలో కొందరు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. ఆమె కోసం వారిలో వారే ఘర్షణలకు దిగారు. వారికి నేతృత్వం వహిస్తున్న కెప్టెన్‌ ఇసిద ఆమెను ఒకరికి ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నిరోజులకే అతను దారుణహత్యకు గురయ్యాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్న ఒకరి తరువాత ఒకరుగా నలుగురు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఐదేళ్లలో 11మంది అనూహ్యంగా మరణించారు. దీంతో మిగిలిన 20 మంది కజుకొను హతమార్చాలని పథకం వేశారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆమె తీరం చేరుకోవడంతో అక్కడ గస్తీలో ఉన్న అమెరికా నౌకాదళ  సిబ్బంది రక్షించారు. తన సొంత పట్టణమైన ఒకినావాకు చేరుకుంది. అప్పటికే ఆమె మొదటి భర్త షోయిచి మరొక మహిళను వివాహం చేసుకొని వుండటంతో నిర్ఘాంత పోయింది. తరువాత ఒంటరిగా జీవనం సాగించి 1970లో కన్నుమూసింది.

20 మంది లొంగిపోయారు..
దీవిలో ఉన్న 20 మంది జపాన్‌ సైనికులు లొంగిపోవాలని అమెరికా జపాన్‌ భాషలో కరపత్రాలను దీవిలో వెదజల్లింది. అయితే యుద్ధం ముగియలేదని భావించిన జపాన్‌సైనికులు లొంగిపోలేదు. చివరకు వారి కుటుంబసభ్యులతో రాసిన లేఖలను దీవికి పంపగా నిజాన్ని గ్రహించిన వారు లొంగిపోయారు.

సినిమాలు , గ్రంథాలు..
అనతహన్‌ ఉదంతంపై పలు గ్రంథాలు వెలువడ్డాయి. 1953లో ఈ ఘటనపై ఒక సినిమాను నిర్మించారు. దీవిలో భూప్రకంపనలు రావడంతో అక్కడున్న కొద్దిమందిని సమీపంలోని సైపాన్‌ దీవికి తరలించారు. ప్రస్తుతం ఆ దీవిలో ఎవరూ లేరు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న