గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ అంటే?

వార్తలు / కథనాలు

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ అంటే?

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ అంతర్జాతీయ సమాజానికి వణుకు పుట్టిస్తోంది. ఈ పిశాచానికి ఇప్పటికే రెండొందల మందికి పైగా బలవ్వగా.. వేల సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారిన పడ్డారు. చైనా వెలుపల దాదాపు 20 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో భారత్‌ కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ).. ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ని ప్రకటించింది. ఇంతకీ ఏంటీ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ? ఎలాంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్‌ఓ ఈ ప్రకటన చేస్తుంది?   

‘పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్ (పీహెచ్‌ఈఐసీ)‌’నే అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. ఓ దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనగా మారిన అసాధారణ పరిస్థితుల్లో దీనిని ప్రకటిస్తారు. తద్వారా.. అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో తీసుకొచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్‌ఆర్) ప్రకారం.. అన్ని దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీపై కచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి. 

ఎమర్జెన్సీ వెనుక ఉద్దేశం ఇదే..

* ఈ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు నెలకొన్నాయనే సందేశాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచానికి తెలియజేస్తుంది. 

* ఆ వ్యాధిపై పోరాడేందుకు ఇతర దేశాలు సహకరించేలా చేస్తుంది. అంటే.. వ్యక్తిగత సిబ్బంది, నిధులు, ఇతర వనరులను ఇస్తూ బాధిత దేశానికి అండగా నిలవడం. 

* వ్యాధి తీవ్రతను నొక్కిచెబుతూ ప్రభావిత దేశాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై డబ్ల్యూహెచ్‌ఓ చేసిన సూచనలు పాటించేలా ఈ ప్రకటన సాయపడుతుంది.

* వ్యాధి ప్రభావిత దేశాలకు వెళ్లకుండా ట్రావెల్‌ అడ్వైజరీని కూడా సిఫార్సు చేసింది. 2003లో సార్స్‌ వైరస్‌ విజృంభించిన సమయంలోనూ డబ్ల్యూహెచ్‌ఓ ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. 

* అత్యయిక స్థితిని ప్రకటించిన తర్వాత ప్రజా ఆరోగ్య చర్యలపై డబ్ల్యూహెచ్‌ఓ సమీక్ష చేపడుతుంది. ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సులను దాటి ఏ దేశమైనా ఇతర ఆంక్షలు విధిస్తే వాటిపై శాస్త్రీయమైన వివరణ ఇవ్వాలని కోరుతుంది. 

ఇప్పటివరకు ఆరుసార్లు..

2009 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. 2009లో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు, 2015లో పోలియో సమయంలో, 2014లో పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విజృంభించినప్పుడు, 2015-16లో జికా వైరస్‌ సమయంలో, 2018లో కివు ఎబోలా వ్యాపించినప్పుడు అత్యయిక స్థితి ప్రకటనలు చేశారు. తాజాగా చైనాలో మొదలైన ‘నావెల్‌ కరోనా’ వైరస్‌ వల్ల మరోసారి ప్రకటించాల్సి వచ్చింది. 

రాజకీయ ఒత్తిళ్లు కూడా..

ఒక్కోసారి ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటిస్తే రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎదురవుతుంటాయి. 2014లో ప్రాణాంతక ఎబోలా వ్యాపించినప్పుడు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్పుడు ఈ నిర్ణయంపై పశ్చిమాఫ్రికా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రకటన తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాయి. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ఎబోలా వ్యాప్తి చెందకుండా అదుపులోకి వచ్చింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

ఇదీ చదవండి.. 
కరోనా.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న