ఒంటరితనం పోగొట్టేందుకు ఓ మంత్రిత్వశాఖ!

వార్తలు / కథనాలు

ఒంటరితనం పోగొట్టేందుకు ఓ మంత్రిత్వశాఖ!

టోక్యో: జపాన్‌లో ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకునేవారు ఎక్కువ. అందుకే ప్రజల్లో ఒంటరితనాన్ని పొగొట్టి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం ఆ దేశ ప్రభుత్వం ‘మినిస్ట్రీ ఆఫ్‌ లోన్లీనెస్‌’ పేరుతో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఆ దేశ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా ఈ మంత్రిత్వ శాఖను రీజినల్‌ రీవైటలేజన్‌ మంత్రికి కేటాయించారు. ప్రపంచదేశాలతో పోలిస్తే జపాన్‌లో ఆత్మహత్య రేటు అధికంగా ఉంటోంది.

ముఖ్యంగా యువత ఆత్మహత్యలకు పాల్పడటం జపాన్‌ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. వృద్ధుల సంఖ్య పెరిగి.. జననాల రేటు తగ్గిపోతూ అనేక సమస్యలను ఆ దేశం ఎదుర్కొంటుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా యువత ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది 20,919 మంది ఆత్మహత్య చేసుకున్నారట. 2019 లెక్కలతో పోలిస్తే ఇది 3.7శాతం అధికం. 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా నష్టపోయినట్లే జపాన్‌ కూడా తీవ్రంగా నష్టపోయింది. 

జపాన్‌లో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి.. ఆర్థికంగా చితికిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మిగిల్చిన వేదనతో ఇప్పటికీ అక్కడి యువతీయువకులు కుంగిపోతున్నారు. కరోనా భయం, క్వారంటైన్‌, భౌతికదూరం, ఒంటరితనం భరించలేక బలవన్మరణాల వైపు మళ్లుతున్నారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న జపాన్‌ ప్రధాని ఈ మేరకు ఒంటరితనాన్ని జయించడానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ ద్వారా యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించనున్నారు. సమస్యలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సంబంధిత మంత్రికి ప్రధాని సూచించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. 2018లోనూ యూకే ‘మినిస్ట్రీ ఆఫ్‌ లోన్లీనెస్‌’ శాఖను ఏర్పాటు చేసింది. కాకపోతే.. ఆ దేశంలో ఒంటరితనం అనుభవిస్తున్న వృద్ధుల సంక్షేమం కోసం దీన్ని ఏర్పాటు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న