డైట్‌ సప్లిమెంట్స్‌: కొవిడ్‌ ముప్పును తగ్గిస్తాయా..?
close

వార్తలు / కథనాలు

డైట్‌ సప్లిమెంట్స్‌: కొవిడ్‌ ముప్పును తగ్గిస్తాయా..?

లండన్‌ పరిశోధకుల తాజా నివేదిక

లండన్‌: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. దీనిబారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ పోషకాల (డైట్‌ సప్లిమెంట్స్‌) వాడటం వల్ల కరోనా వైరస్‌ ముప్పు నుంచి కాస్త రక్షణ పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మల్టీవిటమిన్లు, ఒమేగా-3, విటమిన్‌-డీ సప్లిమెంట్‌లు కరోనా వైరస్‌ ముప్పును తగ్గిస్తాయని బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన నివేదిక బీఎంజే న్యూట్రీషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

కరోనా వైరస్‌ వ్యాపిస్తోన్న సమయంలో వీటి ముప్పు తగ్గించుకునేందుకు కొందరు విటమిన్‌-సీ, జింక్‌ లేదా వెల్లుల్లి కలిగిన సప్లిమెంట్స్‌ వాడుతున్నారు. అయితే, వైరస్‌ బారినపడే ప్రమాదాన్ని తగ్గించడంలో వీటికి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. ఆహార పదార్థాలు, సప్లిమెంట్స్‌ ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తాయనే విషయాన్ని తెలుసుకునేందుకు బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ‘కొవిడ్‌-19 సింప్టమ్స్‌ స్టడీ యాప్‌’ను వినియోగించారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ యాప్‌ను బ్రిటన్‌, అమెరికాతో పాటు స్వీడన్‌లో 2020 మార్చిలో అందుబాటులోకి తెచ్చారు.

యాప్‌ ఆధారిత అధ్యయనం..

అధ్యయనంలో భాగంగా గతేడాది మూడు నెలలపాటు(మే, జూన్‌, జులై) యాప్‌ను వినియోగిస్తోన్న 3,72,720 మంది ఆహార పదార్థాల వాడకం, స్వాబ్‌ టెస్టుల గురించి ఇచ్చిన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ మూడు నెలల పాటు మొత్తం యాప్‌ యూజర్లలో 23,521 మంది కరోనా వైరస్‌ బారినపడగా.. 3,49,199 మందికి నెగటివ్‌ అని తేలింది. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ తీసుకున్న వారిలో 14శాతం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు(12శాతం), మల్టీవిటమిన్‌ (13శాతం), విటమిన్‌ డీ తీసుకున్న వారిలో 9శాతం తక్కువగా వైరస్‌ బయటపడిందని పరిశోధకులు గుర్తించారు. మహిళల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు గుర్తించగా.. పురుషుల్లో మాత్రం ఈ ప్రభావం అంతగా కనిపించలేదని కనుగొన్నారు. ఇక విటమిన్‌ సీ, జింక్‌, వెల్లుల్లి కలిగిన సప్లిమెంట్స్‌ను తీసుకున్న వారిలో అలాంటి ప్రభావం కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

యాప్‌ వినియోగదారుల్లో మొత్తం 3,72,720మంది సమాచారాన్ని విశ్లేషించగా.. దాదాపు లక్షా 75వేల మంది మూడు నెలలపాటు క్రమం తప్పకుండా కృత్రిమ పోషకాలను (డైటరీ సప్లిమెంట్స్‌) తీసుకున్నారు. మరో లక్షా 97వేల మంది వాటికి దూరంగా ఉన్నారు. బ్రిటన్‌తోపాటు అమెరికా (45,757), స్వీడన్‌ (27,373)లలోనూ ఇదే విధమైన ఫలితాలు వచ్చాయని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం పరిశీలనా అధ్యయనం మాత్రమేనని.. ఇలా ఫలితాలు రావడానికి గల కారణాలు నిరూపితం కాలేదని పరిశోధకులు స్పష్టంచేశారు. తాజా అధ్యయనానికి చాలా పరిమితులు ఉన్నప్పటికీ.. వచ్చిన ఫలితాలు గుర్తించదగినవేనని శాస్త్రవేత్తలు సూచించారు. వీటిని నిర్ధారించేందుకు మరిన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ జరగాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న