మీ బూట్లను మీరే డిజైన్‌ చేసుకోండి..!

వార్తలు / కథనాలు

మీ బూట్లను మీరే డిజైన్‌ చేసుకోండి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బూట్లు కొందామని షాపుకెళ్తాం. అక్కడ అనేక రకాల బూట్లు కనిపిస్తాయి. వాటిలో కొన్నింటికి డిజైన్‌ బాగుంటే.. రంగు బాగుండదు. రంగు బాగుంటే డిజైన్‌ బాగుండదు. మనకు నచ్చిన రంగు.. డిజైన్‌ ఉన్న బూట్లు దొరక్క కాస్త అసంతృప్తిగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు మీకూ ఎదురయ్యే ఉంటాయి. కొన్ని సంస్థలు నచ్చిన విధంగా బూట్లు తయారు చేసిచ్చినా వాటి ఖరీదు చాలా ఎక్కువ. అయితే, కస్టమర్లే స్వయంగా తమకు నచ్చిన విధంగా బూట్లను డిజైన్‌ చేసి ఆర్డర్‌ చేస్తే తక్కువ ధరలకే వాటిని తయారు చేసి డెలవరీ చేస్తామంటోంది ఓ ఆన్‌లైన్‌ సంస్థ.

దిల్లీ ఐఐటీలో చదవుకున్న ఆశిష్‌ ప్రకాశ్‌, ఆయుష్‌ జిందాల్‌ స్నేహితులు. వీరిద్దరూ కలిసి 2019లోనే ‘టోస్మిత్‌(www.toesmith.com)’ పేరుతో ఆన్‌లైన్‌లో బూట్లు అమ్మే వ్యాపారం మొదలుపెట్టారు. సంస్థ వెబ్‌సైట్‌లో అన్ని రకాల బూట్ల లే అవుట్లు ఉంటాయి. ఇందులో 3డీ ఇంటరాక్టీవ్‌ డిజైన్‌ టూల్‌ సదుపాయం ఉండటంతో కస్టమర్లు నచ్చిన బూట్ల లే అవుట్లను ఎంపిక చేసుకొని, వాటిపై నచ్చిన రంగులు, డిజైన్లు, బొమ్మలు వేయొచ్చు. బూట్లకు ఐదు భాగాల్లో ఈ మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. డిజైన్‌ పూర్తయ్యాక ఆ బూట్లను ఆర్డర్‌ చేస్తే.. కస్టమర్‌ డిజైన్ చేసినట్లుగానే బూట్లను తయారు చేసి ఇస్తారు.

వీటి ధర రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఉంటుందట. దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా ప్రాంతాల్లో ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలు అందించనుంది. కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే నచ్చిన వాటిని సొంతగా తయారు చేసుకోవడం అలవాటు చేసుకున్న ప్రజలకు ‘టోస్మిత్‌’ ఆలోచన భలేగా నచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే ఈ సంస్థ పాపులర్‌ అవుతోంది. ‘‘తక్కువ ధరలో నచ్చినట్లుగా బూట్లు ఉంటే బాగుంటదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే కస్టమర్లకు నచ్చినట్లుగా బూట్లు తయారు చేసి ఇవ్వాలనుకున్నాం. అందుకే ఈ సంస్థను స్థాపించాం’’అని సంస్థ సహవ్యవస్థాపకుడు ఆయుష్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి..

‘హైహీల్స్’ అప్పట్లో మగవారివే..!‌

కూతురు కోసం.. అమ్మ చేసిన యాప్‌!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న