చాక్లెట్స్‌తోనూ లాభాలున్నాయ్‌!

వార్తలు / కథనాలు

చాక్లెట్స్‌తోనూ లాభాలున్నాయ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాక్లెట్స్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చాక్లెట్స్‌ తింటే దంతాలు పాడవుతాయి, చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియని భయం. కానీ, మితంగా తింటే చాక్లెట్స్‌తో మంచి లాభాలే ఉన్నాయి. అవేంటో చూద్దామా..!

ఒత్తిడిని తగ్గిస్తాయి

చాక్లెట్స్‌ తయారీలో ఉపయోగించే కోకాలో పాలీఫెనాల్స్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి మనిషి ఒత్తిడిని తగ్గిస్తాయట. శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్‌ కణాలను దెబ్బతీస్తుంటాయి. వాటి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. చాక్లెట్స్‌లో ఉండే పాలీఫెనాల్స్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. తద్వారా ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డార్క్‌.. మిల్క్‌ రెండు రకాల చాక్లెట్స్‌లోనూ పాలీఫెనాల్స్‌ ఉంటుందట.

మానసిక స్థితిలో మార్పు

చాక్లెట్స్‌లో ఆనందమైడ్‌ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుపై సానుకూల ప్రభావం చూపి ఒత్తిడి, ఆందోళనను దూరం చేసి సంతోషాన్ని కలిగిస్తుంది. పేరులోనే ఆనందం ఉంది గమనించారా? ఈ కొవ్వు ఆమ్లాలకు పేరు సంస్కృతంలోని ‘ఆనంద’ అనే పదం నుంచి వచ్చిందట. చాక్లెట్స్‌లో ఉండే ఫినైల్‌ఇథైలామైన్‌(పీఈఏ) కూడా మనుషుల్లోని భావాలను.. ప్రేమను పెంపొందించడంలో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, చాక్లెట్స్‌ తయారీలో ఉపయోగించే కోకాలో కెఫిన్‌ ఉంటుంది. ఇది మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

అవయవాలకు రక్ష

చాక్లెట్స్‌తో గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. రక్తనాళల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణ సరిగా జరగకపోతే గుండె జబ్బులు వస్తాయి. అయితే, చాక్లెట్స్‌లో ఉండే ఫ్లేవనోల్‌ అనే రసాయన మూలకం రక్తపోటును నియంత్రిస్తూ గుండెకు రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుందట. అలాగే, యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేసే ఫ్లేవనోల్స్‌ మెదడులో ఉండే న్యూరాన్స్‌కు రక్షణగా నిలుస్తాయి. జ్ఞాపకశక్తికి, దేన్నైనా తొందరగా నేర్చుకోవడంలో దోహదపడతాయి. వృద్ధుల్లో అల్జిమర్స్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయట. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న